Saturday, April 4, 2020

Corona Virus...Dr Visalakshi

శ్రీ రామ జయ రామ జయజయ రామ.

            కరోనా వైరస్.
            - - - - - - - - - -
'శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు', అంటారు.
'మనం ఏది చేశామో దాని ఫలితాన్ని పొందుతాము' అంటారు.
కాల గమనంలో ఏమి జరగబోతోందో మన బ్రహ్మంగారు, మరియు నోష్ట్రాడమస్ లాంటి వారు వివరించారు. సామూహికంగా వచ్చే ఉపద్రవాలకు సామూహికంగా జనులు బలౌతారు. వారు తప్పు చేశారా, ఒప్పు చేశారా, అనే దానితో సంబంధం ఉంటుందా? ఉండదా?? అనేది కూడా ఆలోచించాల్సిన అంశమే.

మన పెద్దవారు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు - "ఏది జరిగినా మన మంచికే" అనుకోమని.

మనకు జీవితంలో చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది - మనకు ఇంత బాధ కలుగుతుంటే, అంతా మన మంచికే అని ఎలా అనుకోవాలి? అని. కానీ తాత్వికంగా ఆలోచిస్తే, నిజమేననిపిస్తుంది.

ప్రస్తుత సమస్య అయిన కరొనా వైరస్ కూడా అలాంటిదే! మొత్తం మానవాళినంతనూ భయాందోళనలకు గురిచేస్తూ, భయభ్రాంతులను చేస్తున్న, మానవులందరినీ అప్రమత్తులను చేస్తున్న కరోనా వైరస్ వల్ల మంచి జరగటమేమిటి ? అని ఆలోచిస్తే, పరమాత్మ ఏది చేసినా, దానికి ఒక ప్రయోజనం ఉంటుంది అని తెలుస్తుంది. సంఘటనలనేవి మనం చేస్తేనే జరుగుతున్నాయి కనుక  వాటికి మనమే బాధ్యత వహించాలని గ్రహించాలి.

ఒకప్పుడు భూభాగం మొత్తం ఏకచ్ఛత్రాధిపత్యంగా మన భారతీయ మహారాజుల చేత పరిపాలించబడిందని మన పురాణాల వలన స్పష్టమవుతోంది. అలాంటిది, భూమంతా ముక్కలుగా విభజింపబడి, అనేక దేశాలుగా మారింది. మొన్న మొన్నటి దాకా మన దేశంలో భాగమైన అనేక భాగాలు చైనాగా, బంగ్లాదేశ్ గా, పాకిస్తాన్ మొదలైన దేశాలుగా విడి పోయాయి. పోనీ స్నేహంగా ఉంటున్నాయా, అంటే కొన్ని శతృదేశాలుగానే ప్రవర్తిస్తున్నాయి. "పోరు నష్టం, పొందు లాభం" అని చెప్తారు మన పెద్దలు. ఎవరికైనా, అందరూ కలిసి మెలిసి ఉంటేనే నిజమైన ఆనందం ఉంటుంది. కానీ, దేశాల దాకా ఎందుకు !! నేటి కాలంలో కుటుంబాలలోనే ఉండటం లేదు నిజమైన ప్రేమ.

దేశంలోని రాష్ట్రాల మధ్యన సయోధ్య ఉండటం లేదు.

సర్వ మానవాళికీ తీరని నష్టాన్ని కలిగిస్తున్న టెర్రరిజం వంటి కామన్ అంశాలపై కూడా ప్రపంచ మానవులందరూ ఏకమవటం లేదు.

కానీ మహాద్భుతంగా ఈ కరోనా వైరస్ మటుకు ప్రపంచ మానవులందరినీ దగ్గర చేసి, ఏక త్రాటి మీద నడిపిస్తోంది.

ఒక్క దేశంలో పుట్టిన ఈ మహమ్మారి వలన ప్రపంచంలో అందరికీ బాధ కలుగుతోంది.

కొత్తగా పెళ్ళై ఇంటికొచ్చిన కోడళ్ళు అత్తగారి మీద చాడీలు చెప్పుకుంటూ ఉంటే, నా మీద చాడీలు చెప్పుకోవటం కోసమైనా కోడళ్ళిద్దరూ అన్యోన్యోగా ఉంటే చాలు అనుకునే అత్తగారిలా, ఒక దేశంలో పుట్టి, అనూహ్యంగా వ్యాపిస్తున్న ఈ కరోనా వైరస్ వలన ప్రపంచంలోని ఇంచుమించుగా అన్ని దేశాలు, 157 దేశాలు ఏకమయ్యాయి. ఏ విధంగా ఈ అంటువ్యాధిని అరికట్టగలము ? ఏది దీనికి మందు ? అని ప్రపంచ దేశాలన్నీ శోధిస్తున్నాయి. ఈ శోధనల వల్ల ప్రపంచ దేశాలన్నింటికీ, మన భారత దేశము యొక్క, మన సనాతన సంప్రదాయము యొక్క, మన హైందవుల ఆచార వ్యవహారముల, ఆహారపుటలవాట్ల యొక్క, మన ఆధ్యాత్మిక, నైతిక జీవన విధానము యొక్క గొప్పదనము అర్ధమవుతున్నది. మన భారతీయులకు, మన హైందవులకు కూడా మన మహర్షులు మనకందించిన జీవన విధానము ఎంత ఘనమైనదో సంపూర్ణంగా అర్ధమవాలని కోరుకుంటున్నాను.

ఇలా ఈ కరోనా వైరస్ వ్యాపిస్తుందనిఏనాడో మన కాలజ్ఞానం చెప్పింది.

ఇప్పుడు ఇది వచ్చాక ఎప్పుడు పూర్తిగా తగ్గుతుందన్న విషయాన్ని మన జ్యోతిశ్శాస్త్ర వేత్తలు చెప్తున్నారు.

ఎలాంటి జీవన విధానం మనం పాటిస్తే, ఈ కరోనా వ్యాప్తిని అరికట్ట గలమో, ఆరోగ్యంగా మనగలమో మన మహర్షులు చెప్పారు. వాటిని పాటించి అందరమూ ఆయురారోగ్యములను పొందుదుము గాక!

ఈ కరోనా వైరస్ వలన విదేశీయులు కూడా మన హైందవ సంప్రదాయాన్ని పాటిస్తూ నమస్కారములు చేయటం ప్రారంభించారు. కరచాలనాలకు స్వస్తి చెప్పారు.

అంటును, మైల మొదలైన వాటిని ఇంట్లో కలపకూడదు, దూరంగా ఉంచి, అశౌచం పాటించాలని, శుచి, శుభ్రతలు, మడి పాటించటం మన ఆరోగ్యానికి మూలమని మన మహర్షులు చెప్పిన, మనము పాటిస్తున్న మన సంప్రదాయమైన ఆచారాలలోని వైజ్ఞానికతను, ఆరోగ్య పరిరక్షణను ఇప్పుడు మానవులందరూ గుర్తిస్తున్నారు.

బయట నుంచి ఇంటికి రాగానే, ఇంటి బైటే కాళ్ళు చేతులు కడుక్కున్నాకే ఇంట్లో అడుగు పెట్టేవాళ్ళము. చాలా కాలంగా దీనిని పాటించడం మానేశారు. ఇప్పుడు ఈ కరోనా వైరస్ వలన మానవులందరూ దీనిని పాటిస్తున్నారు.

ఈ కరోనా వలన మనవైన పసుపు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఇంగువల, తులసి, అల్లం, వెల్లుల్లి యొక్క విలువలను ప్రపంచం గుర్తిస్తోంది.

మనము సర్వ దేవతా స్వరూపముగా, తల్లిగా ఆరాధించే గోమాత యొక్క గొప్పదనాన్ని ప్రపంచం గుర్తించింది. మన మహర్షులు చెప్పిన సర్వ రోగ నివారిణి అయిన పంచ గవ్య ప్రాశనము యొక్క మాహాత్మ్యం ఇప్పుడు అందరికీ అర్ధమవుతోంది. గోజలముతో, గోమయముతో చేసే మందులు కరోనా వైరస్ ను తగ్గిస్తున్నాయని గ్రహించారు. దాని కొరకు మన గోజలమును విదేశాలకు మనవారు ఎగుమతి చేస్తున్నారు.

ఎక్కడ యాగములు, హోమములు జరుగుతాయో, అక్కడ ఏ వైరస్ లు ఉండవు. దైవ శక్తి తరంగాలు పరిసరాలను పవిత్రం చేసి కాపాడతాయి. అది నేటి ఆధునిక యుగంలో కూడా భోపాల్ గాస్ ప్రమాదమప్పుడు నిరూపితమైనది.

మన పవిత్ర వేద ఘోషకు యావద్విశ్వాన్నీ రక్షించే శక్తి ఉంది. ఓంకార జపం, గాయత్రీ మంత్ర జపం, ఇతర అనేకమైన మంత్ర జపములు, శ్రీమద్రామాయణ, భారత భాగవత, శ్రీమద్భగవద్గీతా పారాయణలు, స్తోత్ర పారాయణల వల్ల రోగ నిరోధనము, రోగ మూల కారణ నిర్మూలనము సాధ్యమవుతుందని మనకు తెలిసిన సత్యాన్ని ప్రపంచ ప్రజలు గుర్తిస్తున్నారు.

ఈ విధంగా ప్రపంచ దేశాల్లో మన దేశము యొక్క గొప్పదనానికి గుర్తింపు పెరుగుతోంది.  అత్యంత గౌరవనీయులైన మన ప్రధాని గారు  ఆత్మీయతతో మన ఇరుగు పొరుగు దేశాల వారితో స్పందించిన తీరు మన శతృ దేశాలను మిత్ర దేశాలుగా పరిగణింప జేస్తోంది. దేశ సరిహద్దులలో గొడవలు మరచి, టెర్రరిజమనే మాటను విస్మరించి, విదేశీయులు స్నేహము చూపిస్తున్నారు. మన దేశంలో కుల మత వర్ణ వర్గ విభేదాలు మరచి ప్రజలందరూ ఒకే లక్ష్యమైన కరోనా నిర్మూలనకు కంకణ ధారులయ్యారు.

ఈర్ష్యా  ద్వేషము, అసూయలవంటి వాటిని పక్కన పెట్టి ప్రపంచ మానవులందరి సంక్షేమం కోసం అందరూ కృషి చెయ్యాలి.
మనను శతృ దేశంగా భావించే దేశస్థులందరూ శతృత్వం మరచి, మనతో మైత్రీ బంధాన్ని పాటించాలి.

ఇప్పటికైనా మన భారతీయులకు పాశ్చాత్య వ్యామోహం తగ్గి, వారిని, వారి పద్ధతులను అనుకరించటం మాని, మన సనాతన ధర్మము యొక్క గొప్పదనాన్ని గుర్తించి, ఆచరించటం పారారంభించాలి.

విశ్వంలో అణువణువునా  ఆవరించి ఉన్న పరమాత్మ శక్తిని ధ్యానిస్తే, ఆ చిచ్ఛక్తి  ముందు ఈ కరోనా శక్తి ఎంత? అటువంటి దృఢమైన  నమ్మకం కలగాలి. దానికి మనందరి మనస్సులు విశాలమై, పరిశుద్ధమై, భక్తి భావ భరితమై ఉండాలి.

ఎందరో భక్తులు భక్తితో పరమాత్మను సేవించి, పరమాత్మ కధలు విని, పరమాత్మను స్తోత్రించి, ఎన్నో క్లిష్టమైన సమస్యల నుంచి ముక్తులయ్యరు, తరించారు.

కరోనా వైరస్ తో పోరాటంలో ఏకమైన మానవులందరూ పరస్పరము ఆత్మీయ భావనను పెంపొందించుకుని, భగవద్భక్తిని పెంచుకుని, ఆరోగ్యకరమైన ఆహారవిహారాలతో, శారీరక వ్యాయామాదులు చేస్తూ, ప్రాణాయామము చేస్తూ, సూర్య నమస్కారములు చేస్తూ, యోగాసనాలు వేస్తూ, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలనీ, సహనము, ప్రేమ, త్యాగము, సర్వ మానవ సౌభ్రాతృత్వము వంటి విశాల భావాలు పెంపొందించుకుని, సర్వ మానవ సంక్షేమం కోరుతూ జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని కోరుకుంటూ, అలా అనుగ్రహించమని సాంబసదాశివుని ప్రార్ధిస్తున్నాను.

ప్రపంచ మానవులందరూ పరస్పరం గౌరవ మర్యాదలతో మెలగుతూ విశ్వ శాంతిని వర్ధిల్ల జేయాలి.

"సర్వే జనాస్సుఖినో భవన్తు
సర్వే సన్తు నిరామయాః!
సర్వే భద్రాణి పశ్యన్తు
మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్ "!!
ఓం శాన్తిశ్శాన్తిశ్శాన్తిః.

నమశ్శివాయై చ నమశ్శివాయ.
🙏🙏🙏🙏🙏

డా.విశాలాక్షి.

No comments:

Post a Comment