Saturday, July 21, 2018

తపస్సు - భక్తి, భగవత్శరణాగతి

🙏🌹
తపస్సు - భక్తి, భగవత్శరణాగతి.
------------------------------
తపస్సు అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి, శరణాగతి అంటే ఏమిటి అన్న విషయాలను గురించి,

శ్రీమహావిష్ణువు నాభికమలంలో నుంచి వచ్చిన బ్రహ్మదేవుడు చుట్టూ చూస్తే నీరు తప్ప ఏమీ కనుపించ లేదు. నేనెలా వచ్చాను ? అని ఆలోచిస్తే, ఆయనకి ఓంకారం వినిపించింది, 'తప తప తప' అని వినిపించింది. దాన్ని పరమాత్మ ఆదేశంగా భావించి బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు.
'తప నియమే, తప యోగే, తప ఆలోచనే'.
తపస్సంటే నియమ పాలన, తపస్సంటే యోగము, తపస్సంటే తీవ్రమైన ఆలోచన.
నియమ బద్ధ యుక్తాహారంతో, శుద్ధాంతఃకరణంతో తపస్సు చెయ్యాలి. పరమాత్మను దర్శించాలన్నా, భగవదనుగ్రహం పొందాలన్నా, లౌకికమైన, పారలౌకికమైన కోర్కెలీడేరాలన్నా, ఈ రెంటికీ అతీతమైన పరమ పదమును, శాశ్వతానంద ధామమును చేరాలన్నా తపస్సు కావాలి. తపస్సు లేనిది ఏదీ లభించదు.

తపస్సు అంటే తపించటం. తప అంటే తాపము. ఇంద్రియాలను, మనస్సును, బద్ధిని ఏకత్ర పరచి ఏకాగ్రతతో ఒక లక్ష్యం మీద కేంద్రీకృతం చెయ్యటమే తపస్సు. మనలో ఉన్న ఆత్మ శక్తిని అంటే, పిండాండ శక్తిని విశ్వంలో ఉన్న పరమాత్మ శక్తితో అంటే బ్రహ్మాండములో ఉన్న శక్తితో అనుసంధానించటమే తపస్సు. బహిర్గతమైన ఇంద్రియాలను వృత్తుల మీద ప్రసరించనీయకుండా అంతర్ముఖత్వం చెయ్యటమే తపస్సు. హృదయపద్మంలో ప్రతిష్ఠించబడిన పరమాత్మ దర్శనమే తపస్సు.
ఏదైనా కార్యాన్ని, లౌకికమైన పనినే తదేక నిష్ఠతో, తీక్ష్ణంగా చాలా సేపు చేసినప్పుడు బుర్ర వేడెక్కి పోయింది అంటారు. అదే తపస్సు. కావలసిన లక్ష్యం మీద, చేసే పని మీద ఏకాగ్రత. అలా చేసినప్పుడు ఏ ఫలితం కోరి ఆ పని చేస్తారో, ఆ ఫలితం లభిస్తుంది.
లౌకికమైన చిన్న పనులకే ఇంత తపస్సు అవసరమైతే, అణిమాది సిద్ధులు కాంక్షించినా, స్వర్గాది దివ్య భోగ లోకాలను కోరినా, అతీంద్రియ శక్తులు సంపాదించాలన్నా, అన్నింటి కంటే మించి స్వస్వరూప దర్శనం లభించాలంటే, నిజ తత్త్వం బోధపడాలంటే, పరమాత్మను చేరాలంటే ఇంకెంత బలవత్తరమైన తపస్సు చెయ్యాలి ??

ఉపనిషత్తులలో, పురాణాలలో, ఇతిహాసాలలో అడుగడుగున తపస్సు చెయ్యటం కనిపిస్తుంది. మహర్షులు తపస్సు చేసి తపస్సమాధి స్థితిలో పరమాత్మను దర్శించారు. పరమాత్మ ఆదేశాలను వేదములను విన్నారు. మహర్షులందరూ, దేవతలు, దానవులందరూ తపస్సు చేసి, వారు కోరిన వరాలను పొందారు. బ్రహ్మదేవుడు సృష్టి చెయ్యటానికి ముందు తపస్సు చేస్తాడు. ఆయనకు తపస్సు వల్ల సృష్టి చెయ్యగల శక్తి వస్తుంది. మహర్షులు తపస్సు చేస్తారు. వారి తపస్సు వల్ల వచ్చిన శక్తితో లోక కళ్యాణం జరుగుతుంది. రాక్షసులు లోక కంటకులు, తమోగుణ భరితులు. వారు కూడా తపస్సు చేస్తారు. తపస్సు వల్ల వారు కోరిన వరాలు పొందినా, కొంత కాలం సుఖించినా, దేవతలను కూడా జయించినా, వారు లోక కంటకులు కనుక చివరికి నశించిపోతారు. కానీ వారిలో కూడాపరమ భాగవతోత్తములైన వారు, భగవదనుగ్రహం పొంది చిరస్థాయిగా నిలిచిపోయినవారున్నారు. అటువంటివారిలో భక్త ప్రహ్లాదుడు, వృత్రాసురుడు, గజాసురుడు, బాణాసురుడు మొదలైనవారున్నారు. భక్త ప్రహ్లాదుడు రాక్షస జాతిలో పుట్టినా పరమ భాగవతోత్తముడు, పరమ భక్తుడు, పరమ జ్ఞాని, ఏ అరణ్యాలకు వెళ్ళి తపస్సు చెయ్యక పోయినా, నిత్య తాపసి. మిగతా రాక్షసులందరూ తపస్సు చేసి వరాలు పొందినవారే ! భస్మాసురుడు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు మొదలైన వారు తపస్సు చేసి, వరాలు పొంది, భోగాలనుభవించి, నశించారు. కానీ, గజాసురుడు తానే ఈశ్వరునికి వస్త్రంగా మారాడు, తన చర్మాన్ని శివుడు ధరించేలా అనుగ్రహింప బడ్డాడు. తన తల శివుని ప్రథమ సంతానం శ్రీమహాగణాధిపతి తలలా మారే అదృష్టం పొంది, గజాననునిగా గణపతి రూపంలో సర్వలోక పూజ్యుడయ్యాడు. అతడు అంతటి పరమ శివ భక్తుడు. ఈ అదృష్టాన్ని తపస్సు వల్లే పొందాడు. బాణాసురుని భక్తికి పరవశించిన శ్రీహరి అతని భవనానికి రక్షకునిగా నిలిచి, బాణాసురుని కోసం ఈశ్వరునితో యుద్ధానికి వెనుకాడలేదు. అదీ, తపస్సుకీ, భక్తికీ ఉన్న శక్తి !

మహర్షులు మనో నిగ్రహం కలిగి, ప్రశాంతమైన మనస్సుతో నిరంతర తపోశీలురుగా ఉంటారు. వారి మనస్సులలోని ప్రశాంతత వారున్న ఆశ్రమ పరిసరాలకు, అక్కడున్న ప్రాణికోటికి కూడా ప్రశాంతతను కలిగించి, ఆ ప్రాంతాలలోని జంతువులు కూడా సహజ వైరాన్ని మరచి స్నేహంతో ప్రవర్తిస్తాయి.

అదితి కశ్యపులు, మృకండు మహర్షి వంటి ఎందరో మహాపురుషులు, మహారాజులు సత్సంతాన ప్రాప్తికి తపస్సు చేశారు. ధృవుడు, మార్కండేయుడు, ఉపమన్యువు వంటి బాలురు, పెద్దవారు, ఎందరో భక్తులు భగవద్దర్శనం కోసం తపించి తపస్సు చేశారు. దైవానుగ్రహం పొందారు. భగీరథుని తాత, తండ్రి ఏ ప్రయోజనం కోరి తపస్సు చేశారో ఆ ప్రయోజనాన్ని భగీరథుడు తీవ్రతర తపస్సు చేసి సాధించాడు. దివిజ గంగను భువికి రప్పించి, పితరులను తరింపజేశాడు.
పరమాత్మ అనుగ్రహ ప్రాప్తికి, తరించటానికి తపస్సు ఎంతో ఉపకరిస్తుంది. తపస్సులో నియమ బద్ధ జీవనం వలన ఇంద్రాయ సుఖాలను, శరీర సుఖాలను త్యజించ వలసి ఉంటుంది.

దేవతల పక్షాన ఇంద్రుడు, దానవుల పక్షాన విరోచనుడు ప్రజాపతిని చేరి, గురువుగా సేవించి, ప్రణిపాతం చేసి, ఆత్మ జ్ఞానమును బోధించమని అడిగినప్పుడు వారిని బ్రహ్మచర్య దీక్షతో తపస్సు నాచరించమని ఆజ్ఞాపించాడు గురువు గారు.
వరుణ మహర్షి తన పుత్రుడైన భృగువుకు బ్రహ్మ జ్ఞానం కలిగించటానికి తపస్సు చెయ్యమంటాడు.
విశ్వామిత్ర మహర్షి క్షత్రియ వంశంలో జన్మించి, తపస్సుతో ఋషి అయి, రాజర్షి అయి, మహర్షి అయి, బ్రహ్మర్షి అయ్యాడు. తపస్సు చెయ్యనిదే బ్రహ్మ జ్ఞానము సిద్ధించదు.

ఉపదేశించ బడిన మంత్రము తపస్సు తో జపించటం వలన త్వరగా సిద్ధిస్తుంది.

అలాగే తరించటానికి, పరమాత్మ అనుగ్రహ ప్రాప్తికి భక్తి కన్నా, భగవంతుని పాదపద్మాలను శరణుజొచ్చి, శరణాగతి చెయ్యటము కన్నా సులభతర మార్గము మరొకటుండదు. తాను ఏ నామ రూపాలతో ఉన్న పరమాత్మను ఇష్ట పడతాడో, ఆ దైవమే తన తల్లి, తండ్రి, గురువు, దైవము, సర్వస్వము అని భావించి, ఆ దైవము తప్ప అన్యము లేదని స్థిర చిత్తంతో శరణాగతి చెయ్యాలి. ఇది భక్తి వల్ల మాత్రమే సాధ్యమౌతుంది. ఆ భక్తియే ప్రేమ, వదిలి ఉండలేని అనన్య భావన. ఇది జన్మాంతర సంచిత పుణ్య విశేషం వల్ల కానీ కలుగదు.
ముక్తి పొందడానికి భక్తి, జ్ఞాన, కర్మ, ఉపాసనా మార్గాలు అనేకం ఉన్నాయి. పరమాత్మ ఒక్కడే ! కానీ ఆయనను చేరేందుకు అనేక మార్గాలున్నాయి. ఏ మార్గంలో వెళ్ళినా గమ్యం చేరతాము. కానీ అన్నింటిలోకీ భక్తి మార్గమే అత్యంత శ్రేష్ఠమైనది. అందుకే 'మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ' అన్నారు. ఎందుకంటే భక్తిలో భగవంతుని మీద భక్తునికి ప్రీతి ఉంటుంది. భగవంతుని గుణగానం చేస్తుంటే, భగవన్మహిమలను వింటుంటే, భగవంతుని భక్త వాత్సల్య గాథలను తెలుసుకుంటుంటే, భక్తి భావం పెల్లుబుకుతుంది, తన్మయత్వం కలుగుతుంది. హృదయం ప్రేమ మయమౌతుంది, రసార్ద్రమౌతుంది. హృదయం ఆర్ద్రమవుతుంది. మనస్సు ద్రవిస్తుంది. భక్తి లేని కర్మ మార్గం కానీ, జ్ఞాన మార్గం కానీ ఉపాసనా మార్గం కానీ ఉండవు. అన్నీ పరస్పరం అనుబంధ బంధితమై ఉంటాయి. కానీ అన్ని మార్గాలలోనూ భక్తి అనుస్యూతంగా ఉంటుంది.
సహజ భక్తి వల్ల, అనన్య భక్తి వల్ల సర్వత్ర పరమాత్మను దర్శించగల శక్తి సిద్ధిస్తుంది. నిజమైన భక్తి కలగటమే కష్టం ! దృఢ భక్తి కలిగితే మటుకు భక్తి మాత సంతానమైన జ్ఞాన వైరాగ్యాలు సంపూర్ణంగా సిద్ధిస్తాయి. వాటివల్ల ముక్తి లభిస్తుంది.

భగవద్గీతలో పరమాత్మ
'చతుర్విధా భజన్తే మాం
జనాః సుకృతినో2ర్జున !
ఆర్తో జిజ్ఞాసురర్ధార్ధీ
జ్ఞానీ చ భరతర్షభ' !!
అని చెప్పి,
తేషాం జ్ఞానీ నిత్య యుక్త
ఏకభక్తిర్విశిష్యతే !
'ఈ చతుర్విధ భక్తులలో నాయందే ఏకీభావ స్థితుడై, అనన్య భక్తి యుతుడైన జ్ఞాని అత్యుత్తముడు' అని పరమాత్మ చెప్పాడు .

విద్యా వినయ సంపన్నే
బ్రాహ్మణే గవి హస్తిని !
శుని చైవ శ్వపాకే చ
పండితాస్సమదర్శినః !!

జ్ఞానులు విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందు, గోవు, ఏనుగు, కుక్క, మొదలగు వాని యందు ను, ఛండాలుని యందును సమదృష్టిని కలిగి ఉంటారు.

భక్త్యాత్వనన్యయా శక్యః
అహమేవం విధో2ర్జున !
భక్తి తో తప్ప మరి దేనితోనూ పరమాత్మను తెలుసుకోలేము, చూడలేము.
కర్మ మార్గము వల్ల, జీవుడు ధూమ మార్గము లోనూ, అర్చిరాది మార్గము - దేవమార్గంలోనూ కూడా పయనించ వచ్చును. జీవుడు చేసిన కర్మల బట్టి, ప్రయాణించిన మార్గమును బట్టి పునర్జన్మనెత్తవచ్చును, క్రమముక్తినీ పొందవచ్చును. సగుణ బ్రహ్మోపాసన వల్ల కూడా క్రమముక్తి లభిస్తుంది, దైవ సాయుజ్యాన్ని పొందుతారు. జ్ఞాని జీవన్ముక్తు డవవచ్చును, విదేహముక్తి పొందవచ్చును. 'జ్ఞానాదేవ తు కైవల్యమ్' అన్నారు. నిజమైన జ్ఞాని పరమ భక్తుడవుతాడు. జ్ఞానీ భక్తికి ఉదాహరణ ప్రహ్లాదుడు. భక్తి అంటే భజించటం, సేవించటం.
భజ సేవాయాం, భజ సత్తాయాం. పరమాత్మను చేరే ఏ మార్గమైనా భక్తితో జతపడే ఉంటుంది. భక్తి అయినా, యజ్ఞయాగాది క్రతు నిర్వహణమైనా, జ్ఞాన మార్గ గమనమైనా త్రికరణ శుద్ధిగా చెయ్యాలి, మనస్సు, వాక్కు, శరీరము అనే మూడింటితోను చెయ్యాలి. మనం మన జీవుని సంస్కారాన్ని బట్టి, అభిరుచిని బట్టి, మానవ జీవిత పరమ ప్రయోజనాన్ని - ముక్తిని పొందటానికి, ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకుంటాము. సాధన ప్రథమ దశలో భిన్నంగా కనిపించినా, సాధన సాగే కొద్దీ అన్నీ ఒకే తత్త్వాన్ని చేరే వివిధ మార్గాలనీ, వాటిలో భిన్నత్వము ఉన్నా, అవి పరస్పర సహకారులే కానీ విరుద్ధములు కావనీ గ్రహిస్తారు. అయితే, 'బ్రహ్మవిద్బ్రహ్మైవ భవతి'. జ్ఞానులు తామే బ్రహ్మముగా పరిణమించాక, వారికి పునర్జన్మ ప్రసక్తే ఉండదు. భక్తులు జన్మ రాహిత్యాన్ని కోరుకుంటే, జనన మరణ వలయ భ్రమణము నుంచి ముక్తులౌతారు. కానీ భాగవత భక్తులు మటుకు మాటి మాటిమాటికీ పరమాత్మ నడయాడిన ప్రదేశంలోనే పుట్టాలనీ భగవద్భక్తి రసాంబుధాలో ఓలలాడాలనే కోరుకుంటారు. వారికి జన్మ రాహిత్యం అవసరం లేదు. భక్తి భావ తన్మయత్వమే కావాలి.
శరణాగతి అంటే, త్రికరణ శుద్ధిగా తమను తాము భగవంతునికి అర్పించుకోవటం ! నీవే తప్ప ఇతః పరం బెరుగనని, సర్వస్య సమర్పణ చెయ్యటం శరణాగతి. శరణాగతి చేసిన ఎందరో భక్తులున్నా, గోపికలను శరణాగతికి గొప్ప ఉదాహరణగా చెప్తాము.

అనన్యాశ్చింతయంతో మాం
యే జనాః పర్యుపాసతే !
తేషాం నిత్యాభియుక్తానాం
యోగక్షేమం వహామ్యహమ్ !! అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు.
అటువంటి పరమ జ్ఞానులు, పరమ భక్తులు చేసే పనులే తపస్సు.

🙏🙏🙏🌹

డా.టి(ఎస్)విశాలాక్షి.