Thursday, December 6, 2018

సదా మోహాటవ్యాం

సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ
నటత్యాశా శాఖా స్వటతి ఝటితిః స్వైరమభితః !
కపాలిన్ భిక్షో మే హృదయకపిమత్యంత చపలం
ధృడం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో ॥  20

ఈ శ్లోకం మీద ఎంత చర్చ చేసినా, సంపూర్ణ భావాన్ని చెప్పలేదేమో, అనే అనిపిస్తుంది. సంపూర్ణంగా వివరించాలంటే, ఎన్నో రకాల దృక్కోణాలలో నుంచి చూడాలి. అసలు నిత్యమైనదేది ? సత్యమైనదేది ? అని తెలుసుకోవాలి. నిత్యమైనదీ సత్యమైనదీ కేవలము ఆత్మ మాత్రమే ! పరమాత్మ మాత్రమే ! మనలోని 'నేను' ను గురించి చర్చ చెయ్యాలి, విచారించాలి. భౌతికమైనవన్నీ క్షణికాలే ! ఆ సత్యాన్నే వేద విజ్ఞానం బోధిస్తోంది, ఉపనిషత్తులు ఉద్బోధిస్తున్నాయి. ఈ ప్రపంచంలోకి వచ్చిన మనం, ముళ్ళకంచె మీద పడిన బట్టను ఎంత జాగ్రత్తగా తీసుకోవాలో, అంత జాగ్రత్తగా, తామరాకు మీది నీటి బిందువులలా ఈ ప్రపంచంలో వ్యవహరిస్తూ, మన జీవుడు పరమాత్మను చేరటానికి సాధన చేస్తూ, దుఃఖ రహిత, పునరావృత్తి రహిత శాశ్వతానంద ధామాన్ని చేరటానికి ప్రయత్నించాలి. అదే సాంబసదాశివ పాద సన్నిధి.

శ్రీహర్షుడనే కవి సౌందరానంద కావ్యంలో సుందరి, ఆనందుల అన్యోన్య ఆనందమయ జీవితాన్ని, వారిరువురి మనస్సులలో ఉన్న శృంగారభావావేశాన్ని అత్యంత మనో రంజకంగా వర్ణిస్తారు. సుందరి, ఆనందుడు - ఇద్దరూ అపురూప సౌందర్యవంతులు, అందమైన ఆదర్శవంతమైన దంపతులు, పరస్పరం ప్రేమించుకుంటున్నారు. ఆనందుడికి సుందరి శరీర సౌందర్యం, క్షణం కూడా ఆమెను విడిచి ఉండలేనట్లుగా చేస్తోంది. ఆమె శరీర లావణ్యం, అందమైన ఆ హరిణనేత్రి కన్నుల సోయగం, నునుపుగా అద్దాల్లా కాంతివంతమైన ఆమె చెక్కిళ్ళు, కోటి స్వర్గ సుఖాలనందించే ఆమె మధురాధరములు, పూతీగలలా పెనవేసే ఆమె బాహువులు - ఇలా ఆ వర్ణన సాగిపోతూ ఉంటుంది. వారిద్దరూ ఒక్క క్షణం కూడా విడిచి ఉండరు. ఆనందుని తాపత్రయమంతా, తన సుందరి సౌందర్యం వసి వాడకుండా చూడాలనే ప్రయత్నమే ! ప్రియుడు కనుక అనుక్షణం దాసునిలా ఆమెకు సేవ చేస్తుంటాడు. ఆమె మృదువైన పాదాలకు సుతారంగా లత్తుక అద్దుతాడు, ఆమె బొట్టు పెట్టుకోవటానికి అద్దం పట్టుకుంటాడు ...  ఇలా అదో లోకం ! బాహ్య స్పృహ లేని దైహికానంద రసమయ లోకం !

ఈ ఆనందుడు గౌతమ బుద్ధునిగా ప్రఖ్యాతి గాంచిన సిద్ధార్ధుని తమ్ముడు. గౌతమ బుద్ధుడు ప్రాపంచిక సుఖాల అస్ధిరత్వాన్ని బోధిస్తున్నాడు, జీవితం యొక్క క్షణ భంగురత్వాన్ని విప్పి చెప్తున్నాడు. ప్రాపంచికమైన ఏ అందాలైనా, ఏ సుఖాలైనా, సర్వం క్షణికమ్, సర్వం దుఃఖం అని చెప్తున్నాడు. దుఃఖ రహితమైన శాశ్వతానందం కోసం ప్రయత్నించాలని ప్రబోధిస్తున్నాడు. ఆయన బోధనలు విని ఎందరో ఆయన శిష్యులయ్యారు, బౌద్ధమతం స్వీకరించారు, అనుయాయులుగా మారిపోయారు. కానీ ఎంతమంది వచ్చి ఒక్కసారి బుద్ధుని ప్రబోధాలను వినమని పిలిచినా వెళ్ళడు. ఒకసారి గౌతమ బుద్ధుడే ఆనందుని కలిసి సత్యం బోధించాలని ప్రయత్నం చేస్తుంటే, అతను తన భార్యను వదిలి ఉండలేక ఆమె వద్దకు వెళ్ళిపోవాలని విలవిలలాడిపోతాడు. గౌతమ బుద్ధుడు ఆమెలో ఏమి ఉందని ఆమె సన్నిధిని కోరుతున్నావని అడుగుతాడు. ఆనందుడు ఆమె సౌందర్యం తనను ఆనందపరుస్తోందంటాడు. గౌతమ బుద్ధుడు అది ఆనందం కాదు, మోహపరవశత్వము, ఆ మోహాన్నే వదలాలంటాడు. ఆనందుడు సృష్టిలో తన భార్య సౌందర్యాన్ని మించిన సౌందర్యం లేదు కనుక తనకామె సౌందర్యం కావాలంటాడు. గౌతమ బుద్ధుడు 'నీ భార్య సుందరి అందాన్ని మించిన కోటిరెట్ల సౌందర్యాన్ని, ఆమె సన్నిధిలో నువ్వు పొందుతున్న ఆనందాన్ని మించిన ఆనందాన్ని నీ అనుభవంలోకి తెస్తానం'టాడు. 'అది నిజమైతే, మరి నీ భార్యను వదిలేసి, నా శిష్యుడివయి, బౌద్ధ భిక్షువుగా దీక్ష స్వీకరించిస్తావా?' అని  అడుగుతాడు. ఆనందుడు నా భార్య సౌందర్యాన్ని మించినటువంటి సౌందర్యాన్ని నువ్వు చూపించలేవు. నిజంగా చూపించ గలిగితే, తప్పక నువ్వు చెప్పినట్లుగా చేస్తాను, నీతోనే ఉంటానంటాడు.
గౌతమ బుద్ధుడు ఆనందునికి తన దివ్య శక్తితో, దేవతా స్త్రీలను - అప్సరసలను మించిన అలౌకిక దివ్య త్రిజగన్మోహన సౌందర్యాన్ని చూపిస్తాడు, యోగ శక్తితో అటువంటి అలౌకిక ఆనందానుభవాన్ని కేవలము తన హస్త స్పర్శతో కలిగిస్తాడు. ఆ ఆనంద రసాంబుధిలో మునిగి తేలిన ఆనందుడు బాహ్య స్మృతికి రాగానే సన్యసించి దీక్ష స్వీకరించి, బౌద్ధ భిక్షువవుతాడు, జన్మ చరితార్థం చేసుకుంటాడు.

ఇంద్రియాలు అందానికి ఆకర్షితమవుతుంటాయి. అందమంటే కేవలం  కంటితో చూసే అంద మొక్కటే కాదు. పంచేన్ద్రియాలతో  అనుభవించే ఆనందాలన్నీ, భౌతిక  సుఖాలన్నీ అందాలే ! ఆ అందాలకు భ్రమసి  అందులోనే మునిగి తేలుతూ జన్మ పరంపరలో చిక్కుకుని శ్లేష్మంలో చిక్కుకున్న ఈగలా బైటికి రాలేక కొట్టుకుంటున్నారు.
పంచేన్ద్రియాల ఆకర్షణలో కూడా  రెండు ఇంద్రియాలు  అన్నింటి కంటే ఎక్కువ గా మనిషిని కట్టి పడేస్తాయి. ఆ రెండు - స్పర్శ సుఖము, రసనేంద్రియము.
వీటిలో కూడా  రసనేంద్రియము  జీవితాంతమూ  వెంటాడుతూనే  ఉంటుంది. బ్రతికున్నంత కాలం రసనేంద్రియం రుచులను కోరుకుంటూనే ఉంటుంది. జిహ్వ చాపల్యం తగ్గించు కోవటం చాలా కష్టం. ఇంక రెండవ బలవత్తర మైన ఇంద్రియం గురించి ఆలోచిస్తే, వార్ధక్యం వచ్చి, శరీర పటుత్వం తగ్గితే, స్పర్శ సుఖం  - భౌతిక కామ వాంఛ సన్నగిల్లుతుంది, మనస్సు కోరుతున్నా,  శరీరానికి శక్తి ఉండదు కనుక దాని యందలి ఆసక్తి నశిస్తుంది. కానీ మనస్సుకు వార్ధక్యం ఉండదు. మనస్సులో కోర్కెలు చిగురిస్తూ ఉంటాయి. జ్ఞానంతో వాటిని సమూలంగా .
నిర్మూలనం చెయ్యాలి.
ఆయా ఇంద్రియాల ద్వారా ఆ ఆనందాన్ని  అనుభవించేది  మనస్సు. ఈ మనస్సు ద్వారా ఆనందాన్ని పొందుతున్నది జీవుడు. ఈ జీవుడు అసలైన ఆనందాన్ని అనుభవించ గలిగితే, ఈ భౌతికానందాల జోలికే వెళ్ళడు.
భజ గోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే !
సంప్రాప్తే సన్నిహితే కాలే
న హి న హి రక్షతి డుకృఙ్ కరణే !!
నారీస్తన భర నాభీదేశం
దృష్ట్వా మా గా  మోహావేశం !
మాయామయమిదమఖిలం హిత్వా
బ్రహ్మ పదం త్వం ప్రవిశ విదిత్వా !!
భజగోవింద శ్లోకాల సార విమర్శ చేస్తూ, ఈ శ్లోకంతో అనుసంధానించాలి.
అసలైన ఆనంద ఘనమును గ్రహించాలి.

మన మనస్సనే కోతిని మోహాటవిలో స్వేచ్ఛగా తిరగనియ్యకుండా, భక్తి అనే తాడుతో గట్టిగా కట్టేసి, పరమేశ్వరుడనే భిక్షువునకు అప్పగించేస్తే, ఇంక అది పరమేశ్వరుడు చెప్పినట్లు చేస్తుంది, ఆడమన్నట్లు ఆడుతుంది. పరమేశ్వరుని ఆజ్ఞానువర్తి అయి పరమ పదమును పొందుతుంది. మనస్సు అధీనంలో మనం ఉండకూడదు. మన అధీనంలో - మనము అంటే జీవుడు - శివుడే ! మన అధీనంలో, శివుని అధీనంలో మన మనస్సు ఉండాలి. అప్పుడు కలిగే ఆనందము అసలైన ఆనందము. అదే శివానందము, శివ సౌందర్యానందము, అదే శివానందలహరి !!

🙏🙏🙏🌹🌹

డా. విశాలాక్షి.

A humble request

🙏🙏🙏🌹

ఆత్మీయ పాఠకులందరికీ ప్రణామములు.

మహావాక్యముల సారమును గురించి అధ్యయనం చెయ్యటం ప్రారంభిద్దాము.

ఏ పని చెయ్యాలన్నా, ఆ పని చెయ్యాలనే, సంకల్పము, ఆ పని చెయ్యగల అర్హత, ఏ ఫలము నపేక్షించి ఆ పనిని చెయ్యాలను కుంటున్నాము అనే ప్రయోజనము ఉండాలి.

జ్ఞానార్జన, అందులోనూ ఆధ్యాత్మిక జ్ఞానార్జన చెయ్యాలంటే, దానికి తగిన అర్హత ఉండాలి.
బ్రహ్మ జ్ఞాన విచారం చెయ్యాలంటే సాధన చతుష్టయం ఉండాలని పెద్దలు చెప్తారు. సాధన చతుష్టయమంటే -

1. నిత్యానిత్య వస్తు వివేకము. ఏది నిత్యము - శాశ్వతమైనది, ఏది అనిత్యము - అశాశ్వతమైనది అనే జ్ఞానం కలిగి ఉండటము. ప్రపంచము అశాశ్వతము. కేవలము పరబ్రహ్మము శాశ్వతము

2. ఇహాముత్ర ఫల భోగ విరాగము. ఇహ - ఈ లోకములోని, అముత్ర - అర లోకము లోని - అనగా స్వర్గాది లోకములలోని భోగములను అనుభవించుట యందు వైరాగ్యము కలిగి ఉండాలి.

 3. శమదమాది షట్క సంపత్తి - శమము - అంతరింద్రియ నిగ్రహము, దమము - బాహ్యేంద్రియ నిగ్రహము, ఉపరతి - మనస్సును ప్రపంచ వృత్తుల మీద ప్రసరించకుండా నిగ్రహించటము, బాహ్యవిషయాలను చిత్తవృత్తులతో ఆశ్రయించకుండా ఉండటము, తితిక్ష - సహనము, ఓర్పు, శ్రద్ధ - శాస్త్ర వాక్యములందు, గురు వాక్యములందు నమ్మకము, సమాధానము - ఆత్మ తత్త్వము మీదే మనస్సు లగ్నమయి ఉండటము, ఏకాగ్రత కలిగి ఉండటము - అను నీ ఆరింటిని కలిగి ఉండటము.

4. ముముక్ష - ముక్తి పోందాలనే తీవ్రేచ్ఛ.

బ్రహ్మ జ్ఞానమును, ఉపనిషద్విజ్ఞానమును పొంద గోరిన వారు ముందు వీటిని కలిగి ఉండి, తరువాత సద్గురువునాశ్రయించి, ఉపదేశము ద్వారా గ్రహించ వలసిన గుహ్య విద్య - రహస్య విద్య - వేద విద్య. ఇటువంటి విద్యను అధ్యయనం చెయ్యాలి అనే కోరిక జనించటం పూర్వ జన్మ సుకృత సంస్కార విశేషం. శ్రద్ధతో, శ్రవణ, మనన, నిదిధ్యాసనముల వలన గ్రహించ వలసిన విద్య "మహావాక్యముల సారము - సర్వం ఖల్విదం బ్రహ్మ".

మనకు అనంతమైన వేదరాశిని పరమాత్మ మహర్షుల ద్వారా అందించాడు.
నాలుగు వేదాలున్నాయి.
ఋగ్వేదము, యజుర్వేదము
సామవేదము
అథర్వణ వేదము.
నాలుగు వేదములు ప్రతి ఒక్కటీ - సంహితలు, బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు అని నాలుగు భాగాలుగా చేయబడ్డాయి. ఉపనిషత్తులను వేదాంతము అంటాము. వేదముల సారము కనుక, వేదములలో చివరిలో ఉన్నాయి కనుక ఉపనిషత్తులను జ్ఞానకాండ అంటాము. మిగిలిన భాగాలను కర్మకాండ అంటాము. కర్మకాండలోనూ జ్ఞానబోధ ఉంటుంది. కానీ ఉపనిషత్తులు కేవలము బ్రహ్మజ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని గురించి మాత్రమే బోధిస్తాయి. ప్రతి వేదానికి సంబంధించి ఉపనిషత్తులుంటాయి. ఉపనిషత్తులు మొత్తం పదకొండు వంద లున్నాయంటారు. వాటిలో ముఖ్యమైనవి నూట ఎనిమిది ఉపనిషత్తులు. వీటిలో అత్యంత ప్రధానమైన దశోపనిషత్తులకు జగద్గురువులు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు భాష్యములు వ్రాశారు.
అవి - ఈశావాస్యోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరీయ, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యకోపనిషత్తులు. ఇవి కాక శ్వేతాశ్వతరోపనిషత్తు, కౌశీతకీ ఉపనిషత్తు లాంటి ఉపనిషత్తులన్నీ చాలా జ్ఞాన బోధకములే !
ఈ ఉపనిషత్తు లన్నింటిలో వేల మహావాక్య సదృశ జ్ఞాన బోధక వాక్యాలున్నాయి. కానీ నాలుగు వాక్యాలను మాత్రమే "మహావాక్యములు" అన్నారు. ఏ నాలుగు వాక్యాలను మహావాక్యములు అన్నారు అన్నది మనకు శుకరహస్యోపనిషత్తులో కనిపిస్తుంది.
ప్రతి వేదము యొక్క సారముగా ఆ వేదమునకు సంబంధించిన ఉపనిషత్తులలోని ఒక ఉపనిషత్తు నుంచి ఒక వాక్యము చొప్పున తీసుకున్నారు.
అవి -
1. ఋగ్వేదమునకు చెందిన ఐతరేయోపనిషత్తులోని ' ప్రజ్ఞానం బ్రహ్మ ',

2. యజుర్వేదమునకు సంబంధించిన బృహదారణ్యకోపనిషత్తులోని ' అహం బ్రహ్మా2స్మి ',

3. సామ  వేదాంతర్గతమగు ఛాందోగ్యోపనిషత్తులోని ' తత్త్వమసి ', మరియు

4. అథర్వణ వేదమునకు సంబంధించిన మాండూక్యోపనిషత్తులోని 'అయమాత్మా బ్రహ్మ' అనునవి.
ఈ నాలుగు మహావాక్యములు కలిసి  "సర్వం ఖల్విదం బ్రహ్మ"  అనునటు వంటి మూలాధార మహావాక్యాన్ని బోధిస్తున్నాయని నేను నా థీసిస్ లో మనవి చేశాను. అంటే ఈ యావద్విశ్వమూ బ్రహ్మమే !
"సర్వం బ్రహ్మమయం జగత్" అన్న ఒక్క సత్యాన్ని బోధించటానికి నాలుగు మహావాక్యములు, నాలుగు మహావాక్యముల సారము అర్ధమవటానికి అనేక వందల మహావాక్యములు, ఈ వాక్యాలు సారమర్ధమవటానికి సమస్త వేద వాఙ్మయము - పురాణాలు, ఇతిహాసాదులన్నీ వచ్చాయి.

నాలుగు మహావాక్యములలోను 'తత్వమసి' మహావాక్యమును సర్వోత్కృష్ట మహావాక్యముగా విజ్ఞులు పరిగణిస్తున్నారు.
'తత్త్వమసి' మహావాక్యం అర్ధమవాలంటే అత్యంత వివరంగా సోపపత్తికంగా వివరించుకోవాలి. కానీ సూక్ష్మంగా ఇలా చెప్పవచ్చు.
తత్ త్వం అసి - ఆ పరబ్రహ్మవు నీవే అయి ఉన్నావు - ఇది గురువుగారు శిష్యునికి బ్రహ్మ జ్ఞానాన్ని గురించి చేసిన ఉపదేశ వాక్యము.

నిత్యానిత్య వస్తు వివేకం కలిగి, శమదమాది షట్క సంపత్తిని సంపాదించుకుని, బ్రహ్మచర్య నిష్ఠతో, స్వాధ్యాయముతో చిత్తశుధ్ధిని, చిత్తైకాగ్రతను పొంది, ఇహాముత్ర ఫలభోగములందు విరక్తుడై, ముముక్షువు అయిన జిజ్ఞాసువు శ్రధ్ధతో గురువును ప్రార్ధించి పొందే ఉపదేశము 'తత్త్వమసి' మహావాక్యము.
'తత్' - అది - అనిర్వచనీయ పరబ్రహ్మము. 'త్వం' - నీవు అనగా జీవుడు.
'అసి' అనగా అయి ఉన్నావు. ఇది క్రియా పదము. అస్ - ఉండుట అనే ధాతువు యొక్క మధ్యమ పురుష ఏక వచన రూపము. ఆ పరమాత్మ నీవే అయి ఉన్నావు. ఆ పరబ్రహ్మ తత్త్వము నీ సహజ స్వభావము. అది నువ్వే ! అని అర్ధము. దీనిని జీవబ్రహ్మైక్య బోధక వాక్యము అంటారు. అసి అన్న క్రియా పదము ఐక్యతను తెలియజేస్తోంది. ఇక్కడ తత్ కి త్వం కి ఐక్యత చెప్పబడింది.
ఛాందోగ్యోపనిషత్తులో ఉద్దాలక మహర్షి శ్వేతకేతువు అనే తన కుమారునికి అనేక ఉపపత్తులతో ఈ ఉపదేశ వాక్యాన్ని వివరించారు.
🌹🙏
ఇది చదివిన తరువాత వాయిస్ మెసేజ్ లను వినవలసినదిగా మనవి.

ధన్యవాదములు.
🙏🌹
డా.విశాలాక్షి.

Saturday, July 21, 2018

తపస్సు - భక్తి, భగవత్శరణాగతి

🙏🌹
తపస్సు - భక్తి, భగవత్శరణాగతి.
------------------------------
తపస్సు అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి, శరణాగతి అంటే ఏమిటి అన్న విషయాలను గురించి,

శ్రీమహావిష్ణువు నాభికమలంలో నుంచి వచ్చిన బ్రహ్మదేవుడు చుట్టూ చూస్తే నీరు తప్ప ఏమీ కనుపించ లేదు. నేనెలా వచ్చాను ? అని ఆలోచిస్తే, ఆయనకి ఓంకారం వినిపించింది, 'తప తప తప' అని వినిపించింది. దాన్ని పరమాత్మ ఆదేశంగా భావించి బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు.
'తప నియమే, తప యోగే, తప ఆలోచనే'.
తపస్సంటే నియమ పాలన, తపస్సంటే యోగము, తపస్సంటే తీవ్రమైన ఆలోచన.
నియమ బద్ధ యుక్తాహారంతో, శుద్ధాంతఃకరణంతో తపస్సు చెయ్యాలి. పరమాత్మను దర్శించాలన్నా, భగవదనుగ్రహం పొందాలన్నా, లౌకికమైన, పారలౌకికమైన కోర్కెలీడేరాలన్నా, ఈ రెంటికీ అతీతమైన పరమ పదమును, శాశ్వతానంద ధామమును చేరాలన్నా తపస్సు కావాలి. తపస్సు లేనిది ఏదీ లభించదు.

తపస్సు అంటే తపించటం. తప అంటే తాపము. ఇంద్రియాలను, మనస్సును, బద్ధిని ఏకత్ర పరచి ఏకాగ్రతతో ఒక లక్ష్యం మీద కేంద్రీకృతం చెయ్యటమే తపస్సు. మనలో ఉన్న ఆత్మ శక్తిని అంటే, పిండాండ శక్తిని విశ్వంలో ఉన్న పరమాత్మ శక్తితో అంటే బ్రహ్మాండములో ఉన్న శక్తితో అనుసంధానించటమే తపస్సు. బహిర్గతమైన ఇంద్రియాలను వృత్తుల మీద ప్రసరించనీయకుండా అంతర్ముఖత్వం చెయ్యటమే తపస్సు. హృదయపద్మంలో ప్రతిష్ఠించబడిన పరమాత్మ దర్శనమే తపస్సు.
ఏదైనా కార్యాన్ని, లౌకికమైన పనినే తదేక నిష్ఠతో, తీక్ష్ణంగా చాలా సేపు చేసినప్పుడు బుర్ర వేడెక్కి పోయింది అంటారు. అదే తపస్సు. కావలసిన లక్ష్యం మీద, చేసే పని మీద ఏకాగ్రత. అలా చేసినప్పుడు ఏ ఫలితం కోరి ఆ పని చేస్తారో, ఆ ఫలితం లభిస్తుంది.
లౌకికమైన చిన్న పనులకే ఇంత తపస్సు అవసరమైతే, అణిమాది సిద్ధులు కాంక్షించినా, స్వర్గాది దివ్య భోగ లోకాలను కోరినా, అతీంద్రియ శక్తులు సంపాదించాలన్నా, అన్నింటి కంటే మించి స్వస్వరూప దర్శనం లభించాలంటే, నిజ తత్త్వం బోధపడాలంటే, పరమాత్మను చేరాలంటే ఇంకెంత బలవత్తరమైన తపస్సు చెయ్యాలి ??

ఉపనిషత్తులలో, పురాణాలలో, ఇతిహాసాలలో అడుగడుగున తపస్సు చెయ్యటం కనిపిస్తుంది. మహర్షులు తపస్సు చేసి తపస్సమాధి స్థితిలో పరమాత్మను దర్శించారు. పరమాత్మ ఆదేశాలను వేదములను విన్నారు. మహర్షులందరూ, దేవతలు, దానవులందరూ తపస్సు చేసి, వారు కోరిన వరాలను పొందారు. బ్రహ్మదేవుడు సృష్టి చెయ్యటానికి ముందు తపస్సు చేస్తాడు. ఆయనకు తపస్సు వల్ల సృష్టి చెయ్యగల శక్తి వస్తుంది. మహర్షులు తపస్సు చేస్తారు. వారి తపస్సు వల్ల వచ్చిన శక్తితో లోక కళ్యాణం జరుగుతుంది. రాక్షసులు లోక కంటకులు, తమోగుణ భరితులు. వారు కూడా తపస్సు చేస్తారు. తపస్సు వల్ల వారు కోరిన వరాలు పొందినా, కొంత కాలం సుఖించినా, దేవతలను కూడా జయించినా, వారు లోక కంటకులు కనుక చివరికి నశించిపోతారు. కానీ వారిలో కూడాపరమ భాగవతోత్తములైన వారు, భగవదనుగ్రహం పొంది చిరస్థాయిగా నిలిచిపోయినవారున్నారు. అటువంటివారిలో భక్త ప్రహ్లాదుడు, వృత్రాసురుడు, గజాసురుడు, బాణాసురుడు మొదలైనవారున్నారు. భక్త ప్రహ్లాదుడు రాక్షస జాతిలో పుట్టినా పరమ భాగవతోత్తముడు, పరమ భక్తుడు, పరమ జ్ఞాని, ఏ అరణ్యాలకు వెళ్ళి తపస్సు చెయ్యక పోయినా, నిత్య తాపసి. మిగతా రాక్షసులందరూ తపస్సు చేసి వరాలు పొందినవారే ! భస్మాసురుడు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు మొదలైన వారు తపస్సు చేసి, వరాలు పొంది, భోగాలనుభవించి, నశించారు. కానీ, గజాసురుడు తానే ఈశ్వరునికి వస్త్రంగా మారాడు, తన చర్మాన్ని శివుడు ధరించేలా అనుగ్రహింప బడ్డాడు. తన తల శివుని ప్రథమ సంతానం శ్రీమహాగణాధిపతి తలలా మారే అదృష్టం పొంది, గజాననునిగా గణపతి రూపంలో సర్వలోక పూజ్యుడయ్యాడు. అతడు అంతటి పరమ శివ భక్తుడు. ఈ అదృష్టాన్ని తపస్సు వల్లే పొందాడు. బాణాసురుని భక్తికి పరవశించిన శ్రీహరి అతని భవనానికి రక్షకునిగా నిలిచి, బాణాసురుని కోసం ఈశ్వరునితో యుద్ధానికి వెనుకాడలేదు. అదీ, తపస్సుకీ, భక్తికీ ఉన్న శక్తి !

మహర్షులు మనో నిగ్రహం కలిగి, ప్రశాంతమైన మనస్సుతో నిరంతర తపోశీలురుగా ఉంటారు. వారి మనస్సులలోని ప్రశాంతత వారున్న ఆశ్రమ పరిసరాలకు, అక్కడున్న ప్రాణికోటికి కూడా ప్రశాంతతను కలిగించి, ఆ ప్రాంతాలలోని జంతువులు కూడా సహజ వైరాన్ని మరచి స్నేహంతో ప్రవర్తిస్తాయి.

అదితి కశ్యపులు, మృకండు మహర్షి వంటి ఎందరో మహాపురుషులు, మహారాజులు సత్సంతాన ప్రాప్తికి తపస్సు చేశారు. ధృవుడు, మార్కండేయుడు, ఉపమన్యువు వంటి బాలురు, పెద్దవారు, ఎందరో భక్తులు భగవద్దర్శనం కోసం తపించి తపస్సు చేశారు. దైవానుగ్రహం పొందారు. భగీరథుని తాత, తండ్రి ఏ ప్రయోజనం కోరి తపస్సు చేశారో ఆ ప్రయోజనాన్ని భగీరథుడు తీవ్రతర తపస్సు చేసి సాధించాడు. దివిజ గంగను భువికి రప్పించి, పితరులను తరింపజేశాడు.
పరమాత్మ అనుగ్రహ ప్రాప్తికి, తరించటానికి తపస్సు ఎంతో ఉపకరిస్తుంది. తపస్సులో నియమ బద్ధ జీవనం వలన ఇంద్రాయ సుఖాలను, శరీర సుఖాలను త్యజించ వలసి ఉంటుంది.

దేవతల పక్షాన ఇంద్రుడు, దానవుల పక్షాన విరోచనుడు ప్రజాపతిని చేరి, గురువుగా సేవించి, ప్రణిపాతం చేసి, ఆత్మ జ్ఞానమును బోధించమని అడిగినప్పుడు వారిని బ్రహ్మచర్య దీక్షతో తపస్సు నాచరించమని ఆజ్ఞాపించాడు గురువు గారు.
వరుణ మహర్షి తన పుత్రుడైన భృగువుకు బ్రహ్మ జ్ఞానం కలిగించటానికి తపస్సు చెయ్యమంటాడు.
విశ్వామిత్ర మహర్షి క్షత్రియ వంశంలో జన్మించి, తపస్సుతో ఋషి అయి, రాజర్షి అయి, మహర్షి అయి, బ్రహ్మర్షి అయ్యాడు. తపస్సు చెయ్యనిదే బ్రహ్మ జ్ఞానము సిద్ధించదు.

ఉపదేశించ బడిన మంత్రము తపస్సు తో జపించటం వలన త్వరగా సిద్ధిస్తుంది.

అలాగే తరించటానికి, పరమాత్మ అనుగ్రహ ప్రాప్తికి భక్తి కన్నా, భగవంతుని పాదపద్మాలను శరణుజొచ్చి, శరణాగతి చెయ్యటము కన్నా సులభతర మార్గము మరొకటుండదు. తాను ఏ నామ రూపాలతో ఉన్న పరమాత్మను ఇష్ట పడతాడో, ఆ దైవమే తన తల్లి, తండ్రి, గురువు, దైవము, సర్వస్వము అని భావించి, ఆ దైవము తప్ప అన్యము లేదని స్థిర చిత్తంతో శరణాగతి చెయ్యాలి. ఇది భక్తి వల్ల మాత్రమే సాధ్యమౌతుంది. ఆ భక్తియే ప్రేమ, వదిలి ఉండలేని అనన్య భావన. ఇది జన్మాంతర సంచిత పుణ్య విశేషం వల్ల కానీ కలుగదు.
ముక్తి పొందడానికి భక్తి, జ్ఞాన, కర్మ, ఉపాసనా మార్గాలు అనేకం ఉన్నాయి. పరమాత్మ ఒక్కడే ! కానీ ఆయనను చేరేందుకు అనేక మార్గాలున్నాయి. ఏ మార్గంలో వెళ్ళినా గమ్యం చేరతాము. కానీ అన్నింటిలోకీ భక్తి మార్గమే అత్యంత శ్రేష్ఠమైనది. అందుకే 'మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ' అన్నారు. ఎందుకంటే భక్తిలో భగవంతుని మీద భక్తునికి ప్రీతి ఉంటుంది. భగవంతుని గుణగానం చేస్తుంటే, భగవన్మహిమలను వింటుంటే, భగవంతుని భక్త వాత్సల్య గాథలను తెలుసుకుంటుంటే, భక్తి భావం పెల్లుబుకుతుంది, తన్మయత్వం కలుగుతుంది. హృదయం ప్రేమ మయమౌతుంది, రసార్ద్రమౌతుంది. హృదయం ఆర్ద్రమవుతుంది. మనస్సు ద్రవిస్తుంది. భక్తి లేని కర్మ మార్గం కానీ, జ్ఞాన మార్గం కానీ ఉపాసనా మార్గం కానీ ఉండవు. అన్నీ పరస్పరం అనుబంధ బంధితమై ఉంటాయి. కానీ అన్ని మార్గాలలోనూ భక్తి అనుస్యూతంగా ఉంటుంది.
సహజ భక్తి వల్ల, అనన్య భక్తి వల్ల సర్వత్ర పరమాత్మను దర్శించగల శక్తి సిద్ధిస్తుంది. నిజమైన భక్తి కలగటమే కష్టం ! దృఢ భక్తి కలిగితే మటుకు భక్తి మాత సంతానమైన జ్ఞాన వైరాగ్యాలు సంపూర్ణంగా సిద్ధిస్తాయి. వాటివల్ల ముక్తి లభిస్తుంది.

భగవద్గీతలో పరమాత్మ
'చతుర్విధా భజన్తే మాం
జనాః సుకృతినో2ర్జున !
ఆర్తో జిజ్ఞాసురర్ధార్ధీ
జ్ఞానీ చ భరతర్షభ' !!
అని చెప్పి,
తేషాం జ్ఞానీ నిత్య యుక్త
ఏకభక్తిర్విశిష్యతే !
'ఈ చతుర్విధ భక్తులలో నాయందే ఏకీభావ స్థితుడై, అనన్య భక్తి యుతుడైన జ్ఞాని అత్యుత్తముడు' అని పరమాత్మ చెప్పాడు .

విద్యా వినయ సంపన్నే
బ్రాహ్మణే గవి హస్తిని !
శుని చైవ శ్వపాకే చ
పండితాస్సమదర్శినః !!

జ్ఞానులు విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందు, గోవు, ఏనుగు, కుక్క, మొదలగు వాని యందు ను, ఛండాలుని యందును సమదృష్టిని కలిగి ఉంటారు.

భక్త్యాత్వనన్యయా శక్యః
అహమేవం విధో2ర్జున !
భక్తి తో తప్ప మరి దేనితోనూ పరమాత్మను తెలుసుకోలేము, చూడలేము.
కర్మ మార్గము వల్ల, జీవుడు ధూమ మార్గము లోనూ, అర్చిరాది మార్గము - దేవమార్గంలోనూ కూడా పయనించ వచ్చును. జీవుడు చేసిన కర్మల బట్టి, ప్రయాణించిన మార్గమును బట్టి పునర్జన్మనెత్తవచ్చును, క్రమముక్తినీ పొందవచ్చును. సగుణ బ్రహ్మోపాసన వల్ల కూడా క్రమముక్తి లభిస్తుంది, దైవ సాయుజ్యాన్ని పొందుతారు. జ్ఞాని జీవన్ముక్తు డవవచ్చును, విదేహముక్తి పొందవచ్చును. 'జ్ఞానాదేవ తు కైవల్యమ్' అన్నారు. నిజమైన జ్ఞాని పరమ భక్తుడవుతాడు. జ్ఞానీ భక్తికి ఉదాహరణ ప్రహ్లాదుడు. భక్తి అంటే భజించటం, సేవించటం.
భజ సేవాయాం, భజ సత్తాయాం. పరమాత్మను చేరే ఏ మార్గమైనా భక్తితో జతపడే ఉంటుంది. భక్తి అయినా, యజ్ఞయాగాది క్రతు నిర్వహణమైనా, జ్ఞాన మార్గ గమనమైనా త్రికరణ శుద్ధిగా చెయ్యాలి, మనస్సు, వాక్కు, శరీరము అనే మూడింటితోను చెయ్యాలి. మనం మన జీవుని సంస్కారాన్ని బట్టి, అభిరుచిని బట్టి, మానవ జీవిత పరమ ప్రయోజనాన్ని - ముక్తిని పొందటానికి, ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకుంటాము. సాధన ప్రథమ దశలో భిన్నంగా కనిపించినా, సాధన సాగే కొద్దీ అన్నీ ఒకే తత్త్వాన్ని చేరే వివిధ మార్గాలనీ, వాటిలో భిన్నత్వము ఉన్నా, అవి పరస్పర సహకారులే కానీ విరుద్ధములు కావనీ గ్రహిస్తారు. అయితే, 'బ్రహ్మవిద్బ్రహ్మైవ భవతి'. జ్ఞానులు తామే బ్రహ్మముగా పరిణమించాక, వారికి పునర్జన్మ ప్రసక్తే ఉండదు. భక్తులు జన్మ రాహిత్యాన్ని కోరుకుంటే, జనన మరణ వలయ భ్రమణము నుంచి ముక్తులౌతారు. కానీ భాగవత భక్తులు మటుకు మాటి మాటిమాటికీ పరమాత్మ నడయాడిన ప్రదేశంలోనే పుట్టాలనీ భగవద్భక్తి రసాంబుధాలో ఓలలాడాలనే కోరుకుంటారు. వారికి జన్మ రాహిత్యం అవసరం లేదు. భక్తి భావ తన్మయత్వమే కావాలి.
శరణాగతి అంటే, త్రికరణ శుద్ధిగా తమను తాము భగవంతునికి అర్పించుకోవటం ! నీవే తప్ప ఇతః పరం బెరుగనని, సర్వస్య సమర్పణ చెయ్యటం శరణాగతి. శరణాగతి చేసిన ఎందరో భక్తులున్నా, గోపికలను శరణాగతికి గొప్ప ఉదాహరణగా చెప్తాము.

అనన్యాశ్చింతయంతో మాం
యే జనాః పర్యుపాసతే !
తేషాం నిత్యాభియుక్తానాం
యోగక్షేమం వహామ్యహమ్ !! అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు.
అటువంటి పరమ జ్ఞానులు, పరమ భక్తులు చేసే పనులే తపస్సు.

🙏🙏🙏🌹

డా.టి(ఎస్)విశాలాక్షి.