Sunday, February 14, 2021

Sankaranthi Celebrations --Dr Visalakshi

 సంక్రాంతి  సంబరాలు        

------------------------------


 అది ఒక పల్లెటూరు. 

హరిత శోభిత సుందర సీమ

సంక్రాంతికి రమ్మని పిలువనంప 

మనమందరమేగితి మచటి కిప్పుడే ! 

పొగబండి దిగగానే,  ఎదురొచ్చి తెగమెచ్చి

రెండెడ్ల బండిలో నెక్కించుకొనగ,

ఇటు నటుడు జూచుచు 

నబ్బుర పడుచుండ

సాగుచుండెను బళ్లు వరి చేలమధ్య. 

 

నా బాల్యపు రోజులు మెదిలె మదిలో ! 

నేలను దుక్కి దున్ని వరి నాట్లిడి, 

వరి మళ్ళలోపలన్ కలుపును తీసి

పండిన పంటంత చక్కగ తెగ కోసి, 

వరి రాశిగా పోసి, కుప్ప నూర్చి,

ధాన్యరాశులు గృహమ్ముల చేర, 

నపార సంతసమ్మొప్పగ,

ధాన్యరాశి కడు నేరిమి రోళ్ళ నింపి,  

రోకళ్ళతొ చక్కగ పోటు పెట్టి,

జవరాండ్రు దంచెదరు, చెరిగి పోసెదరు, 

తాల్చెదరింకను నేమిపోసెదర్.

జల్లెడ త్రిప్పుచు తౌడు నూకలన్ వేర్పరచి,

నల్కలనేరి యేరి, తిత్తిరీలను తెగ తీసి, 

పరిశుభ్రము చేసి,  బంగరు బియ్యము కుప్ప చేసి, 

నింపెదరు సంచుల నిండుగ 

బియ్యమియ్యెడన్.


మరి నేడు  - 

ఈ పనులన్నియు చేయును యంత్ర రాజులే !! 


మా ఎడ్ల బండి పయనము కడు రమ్యము మాకు నిపుడు, 

పరికించుచు చనుచుంటిమి.


కళ్ళాపు జల్లి యలికిన ఇంటి వాకిళ్ళ యందు

తరుణీమణులెలదిశలన్

ముత్యాల ముగ్గులు వేసిరి, 

మనోహరమగు రంగులతో 

తీర్చిదిద్దిరధికోత్సుకతోన్.


గోమయమ్ముతోడ గొబ్బెమ్మలను చేసి, 

రంగవల్లుల మధ్య వాటి నుంచి, 

పసుపు కుంకుమ చల్లి, పూలతో పూజించి,  

వాటి చుట్టు రేగిపండ్లు వైచి, 

చెరుకు ముక్కల తోడు బంతిపూవుల తోడ

నలరారు గొబ్బిదేవుళ్ళ కారతిత్తురు - కావుము చల్లగ మమ్ము దీవించుమనుచు.


కురుచగు నెద్దుదెచ్చి, కడు చక్కగ శిక్షణనిచ్చి , తలనూపుట, కాళ్ళనెత్తి నర్తించుట నేర్పి, 

కాళ్ళకు గజ్జెలు కట్టి, 

కొమ్ములకు, మెడకును భూషణమ్ముల నమరించి, 

మూపుపై శాల్వలు కప్పి, 

చిత్రపు రంగు వస్త్రములు మేన నమర్చి, 

గంగిరెద్దును కడు శ్రధ్ధ జేసి, 

డోలు వాయించుచు, బాకా నూదుచు, వీధుల ద్రిప్పుచుండ,  

డూడూ డూడూ బసవన్నా! యన

తల యూచుచు చిత్రపు చేష్టలం జేయు బసవన్నను గని, 

జనులాదరమొప్ప 

నూతన, పురాతన వస్త్ర జాలముల్ మెండుగ కప్పి, 

గంగెద్దుల వానికిత్తురు విత్తమాసక్తి తోడ, 

ప్రణుతింతురు బసవని, 

నిక్కము ఈశ్వరుడే గద వృషభ రాజగున్.!! 


అంబ పలుకు జగదంబ పలుకు ననుచును,

చేత డమరుకమూని 

జోస్యంబు చెప్ప నరుదెంచె 

బుడబుక్కలవాడొకండు, 

హరిలొ రంగ హరీ హరిలొ రంగ హరీ యనుచు, 

చిందులిడు సాతానిజియ్యరొకడు ఇంటింటి ముంగిట నిలచినాడు.

తలపైన నొక రాగి అక్షయ పాత్రతో,

కాలికి ఘల్లుఘల్లను గజ్జెలను కట్టి,

రెండు చేతులలోన చిరుతలను పట్టుకొని, 

శ్రీ హరి కీర్తించు హరిదాసు వచ్చె !! 

చూడనీశ్వరు దలపించు రూపమునను, 

నుదుట విభూతి రేఖల నలదుకొనిన, 

చేత శంఖము పూని, ఓంకార ధ్వని తోడ, 

హరహర నాదమ్ము చేయు జంగమ దేవ రొకడు - అదిగొ, కనుము.

ఇంటికి చేరిన అతిథుల నెంతో ఆదరమున, స్వాగతించి, గారవించి, 

ప్రత్యేక పిండివంటల, 

షడ్రసోపేత భోజనము పెట్ట, 

మది తుష్టి చెందితిమి మేమందరమున్.


సంక్రాంతికి కొలువగావలె బొమ్మల రూపున సర్వ దేవతల ననియెడి భావనా పటిమ, 

భామినులందరు వేడ్కతోడ, 

కడు నేర్పరులై అమర్చిరి 

బొమ్మల కొల్వులు, 

గృహాగతు లచ్చెరు వొందగ సుందరంబుగన్.

కలియుగమందు నీ బొమ్మల కొల్వున కారతిచ్చి, 

పసిపిల్లల కింపుగ తీపి పెట్ట

వంశమ్మభివృధ్ధి చెందునని, 

బ్రహ్మయె చెప్పె, మహీపతి కెప్పుడొ కూర్మి తోడుతన్.


భోగిమంటలు, కోళ్ల పందాల్, 

ఎనుముపోతుల పోరు హోరులు

చెప్పదరమే, బహువిశేషాల్.

మూడు రోజుల పండగిది

బహు ముచ్చటైనది, ముఖ్యమైనది. 

పెద్ద పండగ ఆంధ్ర జనులకు

ప్రకృతి మాత - మానవాళి - జంతు తతికి - ఉన్న బంధం

చాటి చెప్పే గొప్ప పండగ. 

హైందవోత్కర్ష తెలిపే 

సంక్రమణ పండగ - సంక్రాంతి - నవ్య సంక్రాంతి పండుగ. 


 జై హంద్.

----------------------------------------


రచన :


డా.టి(ఎస్)విశాలాక్షి.

భర్తృహరి నీతి శతకము పరిచయము. Dr Visalakshi Batruhari Neeti satkam-Introduction

 భర్తృహరి నీతి శతకము పరిచయము. 

-------------------------------------

సంస్కృత, ఆంధ్ర వాఙ్మయములలో గద్యము, పద్యము, నాటకము, చంపూ మొదలైన అనేక సాహితీ ప్రక్రియలున్నాయి. వాటిలో శతక సాహిత్యము కూడా అత్యంత విస్తారమైనది. 

శతకము అనగా వంద పద్యాలతో రచింపబడిన ఒక సాహితీ ప్రక్రియ. శతకములో ప్రతి పద్యానికీ చివరలో ఒక పదము గానీ, కొన్ని పదములుగానీ, లేక పూర్తి చరణము గానీ ఒకేలా ఉండటం ఆనవాయితీ. దీనిని మకుటము అంటారు. ఆంధ్ర శతకములో ఈ పద్ధతి అధికంగా గోచరిస్తుంది. ఉదాహరణకు 'విశ్వదాభిరామ వినురవేమ' అనునది వేమన శతకము నకు మకుటము. అలాగే 'సుమతీ' అనునది సుమతీ శతకమునకు మకుటము. అదే విధముగా కృష్ణా అనునది కృష్ణ శతకమునకు మకుటము. అలాగే 'శ్రీకాళహస్తీశ్వరా' , 'దాశరథీ కరుణా పయోనిధీ,' 'వేంకటేశ్వరా' ! 'గువ్వలచెన్నా' 'కుమారీ' 'కుమారా' మొదలైనవి ఆయా శతకములకు మకుటములు. కొన్ని శతకములు మకుటము లేకపోయినా, వంద శ్లోకములు లేక పద్యములు రచింపబడటము వలన, ఇతర శతక లక్షణములను కలిగి ఉండటము వలన శతకములని వ్యవహరింపబడతాయి. 


ఒక కావ్యము కానీ ఇతర సాహిత్య గ్రంథమును దేనినైనా తీసుకుంటే, వాటిలో మొదటి నుంచి చివరి దాకా ఒక కథ ఉంటుంది. లేక ఒక అంశానికి సంబంధించి ప్రతి పద్యానికీ అనుబంధం ఉంటూ చెప్పబడుతుంది. కానీ శతకములలోని పద్యములు అలా కాదు. కవి ఒక అంశాన్ని ఎంచుకుని శతకములోని అన్ని పద్యములలోను ఆ అంశమును బోధించునట్లు రచించినా ప్రతి పద్యము దేనికదే పరిపూర్ణమైన ఒక భావాన్ని గురించి చెప్తుంది. ఏ పద్యానికాపద్యం విడిగా ఉంటుంది. చక్కని నీతిని బోధించటమో, సంఘములోని అంశాలను తెలియజెయ్యటం, ఒక దైవము గురించి ప్రస్తావించటమో ఉంటుంది. అందుకే శతకాలు సామాన్య ప్రజానీకంలో ఎంతో ఆదరణను పొందాయి. తెలుగులో సుమతీ శతకము, వేమన శతకము, శ్రీకాళహస్తీశ్వర శతకము, శ్రీకృష్ణ శతకము మొదలైన ఎన్నో శతకాలు జనాదరణ పొందాయి. సంస్కృత శతకములలో భర్తృహరి రచించిన నీతి శతకము విశేష జనాదరణ పొందిన గ్రంథము. 


శతకానికుండ వలసిన లక్షణాలను ముఖ్యంగా ఐదింటిని పేర్కొన వచ్చును. అవి. 1. సంఖ్యా నియమము, 2. మకుట నియమము, 3. వృత్త నియమము, 4. రస నియమము, 5. భాషా నియమము.

శతకములో ఒక రసము ప్రధానమైనచో, ఇంక ఆ శతకములోని పద్యాలన్నీ అదే రసమును పోషిస్తాయి. ఇతర రసముల ప్రయోగ ముండారాదని నియమము. అలా ఆయా రస ప్రధానమైన శతకములెన్నో ఉన్నాయి. రస నియమముల ననుసరించి వెలువడిన శతకములలో  ముఖ్యమైనవాటిలో కొన్ని - భక్తి శతము, శృంగార శతకము, నీతి శతకము, వైరాగ్య శతకము, వేదాంత శతకము, హాస్య శతకము, కథా శతకము, సమస్యా శతకము, మొదలగునవి.


సంస్కృత భాషా ప్రాచీన కవులలో విఖ్యాతి గాంచిన భర్తృహరి సంస్కృత శతక కర్తలలో పేరెన్నికగన్నవారు. ఆయన శతక త్రిశతి కర్త. శృంగార శతకము, నీతి శతకము, వైరాగ్య శతకము అను శతక త్రయమును రచించారు. ఈ మూడింటిని కలిపి ఒక లఘుకావ్యముగా చెప్తారు. ఆయన ఇతర రచనలు చేసినారు. 


ఈ కవి తన గ్రంథములలో ఎక్కడా తన జీవిత కాలమును గూర్చి తెలియ జేయలేదు.  

ఆయన జీవితములోని కొన్ని సంఘటనలు  మాత్రము కథల రూపమున అనుశ్రుతముగా తెలియవచ్చుచున్నవి. 


భర్తృహరి ఉజ్జయినీ రాజ వంశస్థుడనియు, రాజు కావలసినవాడు, తన భార్య దుశ్శీలముచే సంసారమును రోసి, రాజ్యమును తన తమ్ముడగు విక్రమార్కున కప్పగించి తాను వానప్రస్థుడయ్యెనని ఒక ప్రతీతి ఉన్నది. ఈ విక్రమార్కుడే విక్రమ శకాబ్దమునకు మూల పురుషుడు. వరరుచి, విక్రమార్కుడు, భట్టి, భర్తృహరులు సోదరులని చెప్పుదురు. 


భర్తృహరి జీవితమును గురించి కాలమును గురించి అనేక కథలు ప్రచారములో నున్నాయి. ఇదియే సత్యమని ఎవ్వరూ రూఢి పరచలేదు. భర్తృహరి ఒక మహారాజు అని, ఇహపర సౌఖ్యములను విడిచి విరాగియై సన్యాసమును స్వీకరించినాడని, గొప్ప విద్వాంసుడనీ, కవి అనీ, యోగి అనీ మటుకు తెలియుచున్నది. ఆయన రచనలు లోకోపకారకములయి, చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి,ఆయనకు అఖండ కీర్తి నార్జించి పెట్టాయి. 


బహుళ ప్రచారము పొందిన భర్తృహరి శతకములను మహాబలుడు, ఆవంచ రామచంద్ర బుధేంద్రుడు, ధనసారుడు, రామర్షి, గుణవినయుడు, మీననాథుడు, ఇంద్రజిత్తుడు మొదలగు వారు వ్యాఖ్యానించినారు. వారిలో రామచంద్ర బుధేంద్రుడు రచించిన వ్యాఖ్య ఆంధ్ర దేశముననే గాక, యావద్భారతమున వ్యాప్తిలో ఉన్నది. ఆయన పీఠికలో - 


విప్రేణా భూతపూర్వం ఫలమధి తపసాలంభి సూర్యప్రసాదా

ల్లబ్ధ్వా తస్మాత్ స్వయం తత్ప్ర చురతరజరా పఞ్చతా కుఞ్చనాఢ్యమ్ ! 

హిత్వా మోహం స్వకాన్తా స్వతి విమల ధియా తం నిషే వ్యాప్తభవ్యో

యోగీన్ద్రో భర్తృహర్యాహ్వయ ఇహ కురుతే ౽ ద్యాపి విద్యా విలాసమ్.”


అను శ్లోకమున ఈ విషయము ప్రస్తావించ బడింది. 

"ఒకానొక బ్రాహ్మణుడు తనకు సూర్యప్రసాదముచే లభించిన ఫలమును తన ప్రభువగు భర్తృహరికి ఇచ్చారు. ఆ ఫలమును భుజించినవారు జరా, రోగములు లేక యౌవనవంతులుగా ఉంటారు. ఆ ఫలమును భర్తృహరి తనకత్యంత ప్రియమైన తన భార్యకు ఇచ్చారు. ఆమె దానిని తాను భుజించక, తన జారునకు ఇచ్చింది. అతడు దానిని తన మరో ప్రియురాలికి అర్పించెననియు, ఆమె దేశాన్ని పరిపాలించే ప్రభువనే భక్తి భావముతో ఆ ఫలమును భర్తృహరికి సమర్పించెననియు, ఆ విధముగా తనకు అనుగ్రహించ బడిన ఫలము తన వద్దకే వచ్చి చేరింది. ఈ సంగతి తెలిసినంతనే రాజు లోక వృత్తముపై అసహ్యించుకొని, విరాగియై అడవులకు జేరెను."  

   

భర్తృహరి తన వైరాగ్య శతక ప్రారంభమున ఈ విషయమును ప్రస్తావించారు. 


"యాం చింతయామి సతతం మయి సా విరక్తా 

సాప్యన్యమిచ్ఛతి జనం స జనోన్యసక్తః ! 

తస్మిన్ కృతే చ పరితుష్యతి కాచిదన్యా 

ధిక్తాం చ తం చ మదనం చ ఇమాం చ మాం చ"!! 

   

ఎవరిని నేను నిత్యము స్మరిస్తానో, ఆమె నాయందు విరక్తితో ఉన్నది. ఆమె వేరొకరిని ఇష్టపడుతుంది. అతనికి మరొక స్త్రీ అంటే ఇష్టం. ఆమెకు అతనియందనురక్తి లేదు. ఆమె మరొకరిని అభిమానిస్తుంది. ఛీ! ఆమెను, అతనిని, మదనుని, ఈమెను, నన్ను నేను గర్హించుచున్నాను." 


భర్తృహరి తన శృంగార శతకములో తరుణ వయస్కుల మనస్సులలో ఎటువంటి భావములు కలిగి నుద్రేకింపజేయునో, అవి యే విధంగా మనస్సును కలచివైచి శాంతిని దూరము చేయునో అటువంటి కామాదికములను గురించి ప్రస్తావించారు. 


భర్తృహరి వైరాగ్య శతకము వేదాంత సిద్ధాంతమును ప్రతిఫలింపజేయుచుండును. తృష్ణాచ్ఛేదన మావశ్యకమనియు, ఐహిక బంధమునకు మూలము లోభము కనుక కామక్రోధాది అరిషడ్వర్గాలను జయించాలని బోధించారు. ప్రపంచములోని సర్వము తాత్కాలికములేనని గ్రహించి, నిత్యానిత్య వివేకముతో వైరాగ్యము పొంది సుఖించాలని బోధించారు. 


"భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం, 

మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం ! 

శాస్త్రే వాద భయం, గుణే ఖల భయం, కాయే కృతాంతాద్భయం, 

సర్వం వస్తు భయన్వితం భువి నృణాం వైరాగ్య మేవా భయమ్"!!


భర్తృహరి తన నీతి శతకములో సర్వ మానవాళికీ అనేక విధములుగా నీతిని బోధించారు. మానవులందరికీ ఉపకరించే విద్య, ధనము, ధైర్యము, ఆత్మ గౌరవము మొదలైన అనేక అంశాలను వివరించారు. ఆయన నీతి శతకమును పది పద్ధతుల క్రింద విభజించారు. ప్రతి పద్ధతిలోను పది శ్లోకాలు చొప్పున ఉన్నాయి. అవి -

1. మూర్ఖ పద్ధతి 

2. విద్వత్ పద్ధతి

3. మానశౌర్య పద్ధతి

4. అర్ధ పద్ధతి

5. దుర్జన పద్ధతి

6. సుజన పద్ధతి

7. పరోపకార పద్ధతి

8. ధైర్య పద్ధతి

9. దైవ పద్ధతి

10. కర్మ పద్ధతి.


భర్తృహరి సుభాషిత త్రిశతిని తెలుగులోనికి అనేకులు అనువదించారు. ఆ కవులలో ఎలకూచి బాలసరస్వతి, ఏనుగు లక్ష్మణ కవి, పుష్పగిరి తిమ్మన అను ముగ్గురు ముఖ్యులు. వీరిలో ఏనుగు లక్ష్మణ కవి అనువాదము విస్తృత ప్రచారములో నున్నది. ఈయన ఆరువేల నియోగి బ్రాహ్మణుడు. ఈయన వంశములోని పూర్వీకులైన జలపాల మంత్రి గారు తూర్పు గోదావరి జిల్లా సంస్థానాధీశ్వరుల వద్ద ఏనుగులను బహుమతిగా పొందటం చేత వీరి పూర్వీకుల ఇంటిపేరు స్థానములో ఏనుగు చేర్చబడి వ్యవహరింప బడుతున్నది. ఏనుగు లక్ష్మణ కవి రామేశ్వర మాహాత్మ్యము, విశ్వామిత్ర చరిత్రము, శ్రీ సూర్య శతకము మున్నగు రచనలను కూడా చేశారు.


భర్తృహరి రచించిన, ఏనుగు లక్ష్మణ కవి చేత అనువదింపబడిన నీతి శతకమును అధ్యయనము చేద్దాము.


🙏🌹

డా.విశాలాక్షి.

Hindu gods Idols being destroyed in Andra pradesh -Dr Visalakshi

 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శ్రీ రామ జయ రామ జయజయ రామ! 

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ! 

సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే!! 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


మన భారత దేశ చరిత్రలో మన దైవ విగ్రహాల మీద, దేవాలయాల మీద అనేక మార్లు దండయాత్రలు జరిగాయి, వేలాది ఆలయాలు నేల కూల్చబడ్డాయి, దైవ విగ్రహాలు ముక్కలు చెయ్యబడ్డాయి. ఎన్నో ఆలయాలు శిథిలం కావించబడ్డాయి. దైవ విగ్రహాల తలలు, కాళ్ళు, చేతులు ముక్కలుగా నరక బడ్డాయి. వాటిని సందర్శించినప్పుడు, ఆ సంఘటనల గురించి చదివి నప్పుడు, విన్నప్పుడు మన రక్తం సలసల మరిగేది, బాధతో హృదయం ద్రవించేది. ఎవ్వరికీ ఎప్పుడూ ఏ హానీ చెయ్యని, సర్వ మానవ శ్రేయస్సును కాంక్షించే, "వసుధైక కుటుంబ" భావనతో జీవించే మా హైందవుల మీద ఈ దాడులేమిటి? అని మనస్సు ఆక్రోశించేది. మేమే కనక ఆ కాలంలో ఉంటే ఆ దుర్మార్గులను కత్తికో కండగా నరికే వాళ్ళము అనే మాటలను విని, వారి ఆర్తి మన హృదయాలలో ఆర్తిగా జ్వలిస్తుండగా ఆ కాలంలో మన దైవాలను, ఆలయాలను, మన ధర్మాన్ని రక్షించినవారికి, రక్షించటంలో అసువులు బాసి తరించిన వారికి భక్తితో నివాళులర్పించాము. *ఎందరో భక్తులు మన దైవ విగ్రహాల రక్షణలో, దేవాలయాల పరి రక్షణలో ప్రాణాలను త్యాగం చేశారు. ఎందరో మన దైవ విగ్రహాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, తరువాత పునః ప్రతిష్ఠించి, మన దైవాలను మనకందించి, ఆరాధించటం ప్రారంభించారు. శ్రీమతి రాణి అహల్యాబాయి లాంటివారు కాశీ విశ్వనాథాలయం వంటి ఎన్నో దివ్య క్షేత్రాలను పునరుద్ధరించారు. ఎంతమంది దుర్మార్గులైన విమతస్థులు మన మతానికి, మన ధర్మానికి, మన దైవాలకు ద్రోహం చేస్తున్నా, మనం - మన పూర్వీకులు ఎంతో నిష్ఠతో మన దైవ విగ్రహాలను, దేవాలయాలను పరిరక్షిస్తూ, పునరుద్ధరిస్తూ వస్తున్నారు. 

ఇదంతా తురుష్కుల దండయాత్రలప్పుడు, వారు మన దేశమును పరిపాలించే టప్పుడు జరిగాయి. రత్నగర్భగా పేరు గాంచి, జ్ఞానముతో, సంపదలతో, భోగభాగ్యాలతో, గొప్ప సంస్కృతితో విలసిల్లే మన సంస్కృతిని నశింపజెయ్యాలనీ, మన రత్నరాశులను కొల్లగొట్టాలనీ, మన జ్ఞానరాశికి మూలమైన తాళపత్ర గ్రంథాలను నశింపజెయ్యటానికి, మన దైవం మీద మనకున్న భక్తి శ్రద్ధలను సన్నగిల్ల జెయ్యటానికి ఆ దాడులు, ఘాతుకాలు, కిరాతకాలు జరిగాయి. 


కానీ నేటి ఈ ఆధునిక యుగంలో, మన భారత దేశానికి పరాయి పాలన నుంచి విముక్తి లభించి, స్వాతంత్య్ర లభించాక, మనమే మనను పాలించుకుంటున్నప్పుడు ఇటువంటి అమానుష కృత్యాలు జరగటమేమిటి? దానిని మన ప్రభుత్వాలు తీవ్రంగా ఖండించి, ద్రోహులను శిక్షించక పోవటమేమిటి? హిందూ దేశంలో, హిందువుల పాలనలో, హిందూ ధర్మానికి, హిందూ మతానికి, హిందూ దైవాలకు రక్షణ లేకపోవటమేమిటి ? ఈ మధ్య కాలంలోనే విపరీతంగా దాడులు జరగటమేమిటి? ఎవరు చేస్తున్నారో తెలుసుకుని శిక్షించలేకపోవటమేమిటి ? తప్పు చేసినవారెవరో తెలిసి కూడా వారిని వదలటం, అమాయకులను శిక్షించటం కూడా కొన్ని సార్లు జరుగుతోంది. ఇదెంత పాప కృత్యమో కదా ! ఈ మధ్యనే మన దేశంలోని విజయవాడలో, పిఠాపురం మొదలైన వివిధ ప్రాంతాల్లో అనేక దైవ విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి, ఆలయాలు నేల కూల్చబడ్డాయి. ఆ సమయంలో భక్తులైన, ఆస్తికులైన హైందవుల హృదయాలు బాధతో విలవిలలాడాయి. మనమందరమూ ఎంతో బాధ పడ్డాము. ప్రభుత్వం ఆ దుర్మార్గులను శిక్షించి, మన ఆలయాలను, దైవ విగ్రహాలను రక్షించాలని, మన ధర్మానికి న్యాయం చెయ్యాలనీ, చేస్తారనీ ఆశించాము. మన వాళ్ళు కొందరు వెళ్ళి చూసి, అయ్యో అన్నారే కానీ దుష్టులను శిక్షించటానికి ఏ చర్యా చేపట్టలేదు. 


ఇప్పుడు మనందరికీ ఆరాధ్య దైవము, ఆదర్శ మూర్తి, ఆదర్శ ప్రభువు, శ్రీమద్రామాయణ స్వరూపుడు, సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు అయిన, రామతీర్థములో వెలసి, మనందరి చేత ఆరాధింపబడుతున్న, విజయనగరంలో రామ తీర్థంలో కొలువైయున్న శ్రీరామ చంద్ర మూర్తి విగ్రహాన్ని విగత శిరునిగా చేసి, మన దైవాన్ని, మన మతాన్ని, మన నమ్మకాలను ఖండిస్తున్న దుష్ట శక్తులను, దౌర్జన్యాన్ని అడ్డుకోలేకపోతే, ఆపలేకపోతే మనము హైందవులమవుతామా ? భారతీయులమవుతామా ? మానవులమవుతామా ? 


బ్రిటిష్ వాళ్ళ పాలన వల్లే మన హైందవులలో చాలా మంది మనము హైందవులమనీ, మనది సనాతన ధర్మమనీ మర్చేపోయారు. అనాది కాలం నుంచి, సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఉన్న, యావన్మానవాళికీ జ్ఞానమునిచ్చిన మన వేదములు, శాస్త్రములు, పురాణేతిహాసాది అనంత జ్ఞాన రాశిని - కనీసం ఇంతటి జ్ఞాన రాశికి, మహోన్నతమైన సభ్యత, సంస్కారములు, సంస్కృతి, నాగరికతలకు వారసులమని మర్చేపోయారు. మనకు ఎన్ని శాస్త్రములున్నాయో వాటి పేర్లైనా తెలీకుండా బ్రతికేస్తున్నాము. విదేశీయుల, విమతస్థుల ఎడతెగని దాడుల వలన, బ్రిటిష్ వారి పాలనలో మగ్గటం వలన ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయములను నిర్వహించినది, అనంతమైన శాస్త్రాలకు, లక్షల గ్రంథ రాశికి నెలవు మన భారత దేశమనీ మర్చేపోయారు మన భారతీయులు. మనము సర్వ తంత్రం స్వతంత్రంగా బ్రతికే జ్ఞాన స్వరూపులమనీ మర్చేపోయారు. బానిసత్వపు బ్రతుకులకు అలవాటైపోయి, స్వాతంత్య్రం వచ్చి డెభ్బై ఏళ్ళు దాటినా, బానిసత్వపు మనస్తత్వం పోక పరాయి దేశాలను అనుకరిస్తూ, మన ధర్మాలను, మన దైవాన్ని విస్మరిస్తున్నారు. మెకాలే మన దేశంలో ఏర్పరచిన విద్యావిధానంతో తప్పుడు చరిత్ర చదువుతూ అదే సత్యమనుకుంటూ మన గురుకుల సంప్రదాయ విద్యావిధానంలోని గొప్పదనాన్ని కనీసం ఊహించలేక పోతున్నారు.


ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని వృద్ధి పరచే జీవన విధానాన్ని విస్మరించి, దేవతార్చనలను, నైవేద్యములను పెట్టటం విసర్జించి, పీట మీద కూర్చుని, ఆరిటాకులలో దేవతలకు నివేదించిన ప్రసాదం తినకుండా, టేబుల్ మానర్స్ అంటూ, టేబుల్ మీద పెట్టుకు తింటూ, అంటూ శొంట్లను కలిపేస్తూ, అనారోగ్యాలకు బానిసలవుతున్నారు. "పరోపకారార్థమిదం శరీరమని" బ్రతికే మనం అధికార దాహంతో, స్వార్ధంతో మన మతానికి, మన ధర్మానికి, మన దేవతలకు ద్రోహం చేసేవారిని ప్రతిఘటించే ధైర్యం లేక, మనవారిలోనే కొందరు మన వారినే విమర్శిస్తుంటే చేతకానివారిలా మనస్సులో బాధ పడుతుంటే ఏం లాభం ?? దేవుడు సర్వ శక్తిమంతుడంటారుగా ! ఆలయాలను, విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే, ఆయన రక్షించుకోలేడా ? అంటూ కువిమర్శలు చేస్తారు. దైవం దృష్టిలో సర్వము సమానమే ! మంచి, చెడు సర్వము సృష్టిలో భాగమే ! కానీ "పరోపకారః పుణ్యాయ, పాపాయ పరపీడనమ్" అన్నారు. "స్వధర్మే నిధనం శ్రేయః, పరధర్మో భయావహః" అని పరమాత్మే చెప్పారు. దైవం మనకు వివేకాన్నిచ్చాడు, మనకు మన ధర్మాలను, మన బాధ్యతలను, వాటిని స్వతంత్రంగా ఆలోచించి, వివేకంతో పని చెయ్యగల శక్తిని ఇచ్చాడు. కనుక మన దైవాలను, మన ఆలయాలను, మన ధర్మాన్ని మనమే తప్పక రక్షించుకోవాలి. మన ధర్మాన్ని మనం రక్షించుకోవటానికి, దుర్మార్గాన్ని నశింపజెయ్యటానికి మనమంతా ఏకమై, సంఘటితమై, మన ధర్మరక్షణను సంకల్పం చేసి, వ్యక్తిగతంగా, సామూహికంగా దైవ ప్రార్ధనలు చెయ్యాలి. రుద్రాభిషేకాలు చెయ్యాలి. ఇష్టదేవతా నామ, మంత్ర జపం చెయ్యాలి. "శ్రీరామ జయ రామ జయజయ రామ" అనీ, "శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే !

సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే" !! అనీ లక్షల మార్లు జపించాలి. దుశ్చర్యలకు పాల్పడినవారిని ప్రభుత్వం చేత శిక్షింపచెయ్యటానికి కూడా మనమందరమూ ఏకమవాలి, దుర్మార్గాన్ని, అధర్మాన్ని ప్రతిఘటించాలి. జగద్గురువుల ఆదేశాలతో, ఆశీస్సులతో, సంకల్పంతో, వారి నేతృత్వంలో, ధర్మపీఠాధిపతుల, ధర్మ సంరక్షకుల నేతృత్వంలో మనమందరం సంఘటితమవాలి. "సంఘే శక్తిః కలౌ యుగే". సామూహికంగా దైవ ప్రార్ధనలు చేసి ఆత్మ శక్తిని పెంపొందించుకుని, దైవానుగ్రహం పొంది, మన దేవతా మూర్తులను మనమే రక్షించుకోవాలి. ఆత్మ విమర్శ లేకుండా బ్రతికే, నీతినియమాలు లేనివారు అధికారులైతే దేశానికి, ధర్మానికి, ప్రజలకు భద్రత ఏముంటుంది ? దేశభక్తి కల నాయకులకు మద్దతునివ్వాలి.


దేశానికి కానీ, ధర్మానికి కానీ, మన దైవాలకు కానీ ద్రోహం జరుగుతుంటే, అన్నింటినీ పక్కన పెట్టి, అందరూ సంఘటితమై ఎదిరించి, విజయాన్ని సాధించ వలసిన బాధ్యత ప్రతి హిందువుది, ప్రతి భారతీయునిది. ఇది అందరూ గుర్తించి ప్రవర్తింతురు గాక ! మన ఇంట్లో కనుక పొరపాటున నిప్పంటుకుంటే ఏం చేస్తాము ? ఇంట్లో ఉన్న అందరమూ మన అన్ని పనులను పక్కన పెట్టేసి, ఆ క్షణాన్నే అందరం కలిసి నీళ్ళు పోసీ, వేరే ప్రయత్నాలు చేసీ ముందు మంటలనార్పుతాము కదా ! అలాగే ఇప్పుడు మనమందరం సంఘటితమై అన్ని విధాలా ప్రయత్నించి, మన ధర్మాన్ని మనం రక్షించుకోవటానికి ఏకమవాలి. విజయం సాధించాలి. 


ఇంక భవిష్యత్తులో ఎప్పుడూ మన ధర్మం మీద, ఆలయాల మీద, దైవ విగ్రహాల మీద ఏ దాడులు జరుగకుండు గాక ! మానవులందరిలోను ధర్మతేజము వర్ధిల్లు గాక ! స్వధర్మ పాలన వృద్ధి చెందు గాక ! దైవ భక్తి, ధర్మ నిష్ఠ దృఢపడు గాక ! 

సంపూర్ణ పరివార సమేత శ్రీరామ చంద్ర మూర్తి మనలను అనుగ్రహించు గాక ! సాంబసదాశివుని అనుగ్రహం మనకు పరిపూర్ణంగా లభించు గాక ! ఉగ్ర నృసింహ స్వామి మనలనావేశించి కార్య సాఫల్యతను కలిగించు గాక ! సర్వే జనాః సుజనాః భవన్తు! సర్వే సుజనాః సుఖినో భవన్తు. 

ఓం శాన్తిశ్శాన్తిశ్శాన్తిః


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

డా.విశాలాక్షి.

Saturday, April 4, 2020

అసతో మా సద్గమయ Dr Visalakshi

అసతో మా సద్గమయ
తమసో మా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతం గమయ.
ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః !!

మన భారత దేశ ప్రజలందరి ఆయురారోగ్యముల కోసము, ప్రపంచ ప్రజల క్షేమము కోసము మన దేశ ప్రధాని గారి పిలుపు మేరకు మనమందరము ఇవాళ రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది నిముషాల సేపు మనందరి సంఘీ భావమును ప్రకటిస్తూ మన ఇళ్ళల్లో దీపాలు వెలిగిద్దాము. ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ, మరే నూనేతోనైనా మన ఇంటి బాల్కనీలలో నిలబడి దీపాలు వెలిగిద్దాము. లేదా, కొవ్వొత్తి అయినా వెలిగించవచ్చు, టార్చ్ లైట్ ఆన్ చేసి వెలుగును చూపవచ్చు, లేదా సెల్ ఫోన్ లోని టార్చ్ నైనా ఆన్ చెయ్యవచ్చు. కావలసినది మటుకు, కుల మత వర్ణ వర్గ లింగ వయో భాషా భేదములు లేకుండా మన భారతీయులమందరము ఏకమైయున్నామనీ, ప్రస్తుతము మనలను, మానవులందరినీ బాధిస్తున్న శతృవుపై ధ్వజమెత్తి, విజయాన్ని కాంక్షిస్తున్నామనీ తెలియజెయ్యటమే ! లాక్డౌన లో ఉన్నవారందరికీ మీ కోసం మేమున్నామని తెలియజెయ్యటమే ! మనందరి ఆరోగ్యము కోసము తమ ఆయురారోగ్యములను పణంగా పెట్టి అహరహము కృషి చేస్తున్న వైద్యులకు, నర్సులకు, పారా మేడికల్ ష్టాఫ్ వారికి, శానిటరీ వర్కర్స్ కి, పోలీసు శాఖ వారికి, నిత్యావసర వస్తువులను సమకూరుస్తున్న వారందరికీ, మనందరి రక్షణ కోసం కృషి చేస్తున్న వారందరి పట్ల, అధికారుల పట్ల కృతజ్ఞతలు తెలియజేయటానికి, మీకు మేమున్నామని చెప్పటానికి, మనందరిలో ఐకమత్యమున్నదని తెలియపరచటానికి మనమందరమూ ఇవాళ రాత్రి తొమ్మిది గంటల నుండి తొమ్మిది నిముషాల సేపు మన మనస్సుతో దుష్ట త్వము మీద విజయాన్ని సంకల్పించి, దీపాలను వెలిగించి, ఆ సమయంలో మన మన ఇళ్ళల్లో ఉన్న విద్దుద్దీపాలను తొమ్మిది నిముషాల సేపు నిలిపివేద్దాము. ఆ సమయంలో మన ఇళ్ళల్లోని ఫాన్లు, ఏసిలు ఆన్ లోనే ఉండవచ్చును. ఎవరైనా వెట్ గ్రైండర్ లో పప్పు రుబ్బుకుంటుంటే, దానిని ఆన్ లో ఉంచ వచ్చును.

చేయవలసినది ఏమిటంటే, చెడు మీద మంచి విజయం సాధించాలనే సామూహిక సంకల్పంతో ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క దీపం వెలిగించటం, ఆ తొమ్మిది నిముషాల సేపు మనం వెలిగించిన దీప కాంతులు కనిపించటం కోసము మన ఇళ్ళల్లోని విద్దుద్దీపాలను నిలిపి వెయ్యటము. దీని వలన మనం అనేక ప్రయోజనాలను సాధించగలము.

1. దీప ప్రజ్వలనము దేవతారాధన.

"దీపం జ్యోతి పరబ్రహ్మ
దీపం జ్యోతీ పరాయణం !
దీపేన సాధ్యతే సర్వం
దీపదేవీ నమో2స్తు తే" !!

మన భారతీయ సంప్రదాయంలో దీపం వెలిగించనిదే ఏ పనీ మొదలు పెట్టము. ఏ పూజకైనా, ఫంక్షన్లకైనా, పుస్తకావిష్కరణ సభలకైనా అన్నింటికీ ముందు దీప ప్రజ్వలనంతోనే కార్యక్రమం ప్రారంభమవుతుంది.

ప్రపంచ దీపం శ్రీ సూర్యనారాయణ స్వామి వెలగటం ప్రారంభమవగానే మనకు పగలు ప్రారంభమై, మనలోని తంద్రత ఎగిరిపోయి, చురుకుదనం, ఉత్సాహం, పని చెయ్యగల సామర్ధ్యం కలుగుతాయి.

పంచాయతన పూజలో దీపము రూపంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడని చెప్తారు. జ్యోతిశ్శాస్త్ర ప్రకారము నేటి ఈ గడ్డు కాలంలో దీప రూపంలో సుబ్రహ్మణ్య ఆరాధన ఆయురారోగ్య జ్ఞాన ప్రదాయకము.

2. కుల మత వర్ణ వర్గ లింగ వయో భాషా భేదాదులు ఏవీ లేకుండా, మానవులందరమూ ఒక్కటేనని చాటి చెప్పే మహత్తర అవకాశము మనము ఇలా ఒకే సమయంలో ఒకే సంకల్పంతో వెలుగును, జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఒకే పని - దీప ప్రజ్వలనము చెయ్యటము. దీప ప్రజ్వలనము పాప హరము. ఇలా దీపాలు వెలిగించటం వలన మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ తొలగిపోతాయి. జీవితంలో ఒక్కసారైనా దీపము వెలిగించనివారు ఇప్పుడు దీపం వెలిగించటం వలన ఆ దోషాన్ని పోగొట్టుకుంటారు. దోషం పోతే శుభం కలుగుతుంది. పాపం పోతే పుణ్యం లభిస్తుంది.

3. దీపాలు వెలిగించే సంప్రదాయం లేనివారైనా భారతీయులందరూ, మానవులందరూ కూడా వెలుగును కాంక్షిస్తారు కదా ! వెలుగు లేకపోతే అంధకారమే !  అది ఎవ్వరమూ కోరము కదా ! కనుక మనకు వెలుగు కావాలి. ఆరోగ్యము, ఆయుర్దాయము, ఆనందము కావాలని కోరటమే ఈ కొవ్వొత్తి మొదలైన వాటితో వెలుగును చూపించటము.

4. "సంఘే శక్తిః కలౌ యుగే" అన్నారు. కలియుగంలో సమూహికంగా చేసే పనులకు శక్తి ఎక్కువ. సామూహికంగా ఒక్కటై మనమందరమూ సంకల్పిస్తే, నేడు ప్రపంచ మానవులెదుర్కొంటున్న సమస్య రూపు మాసి పోతుంది. ఈ యుద్ధంలో మానవులు విజయము పొందుతాము.

5. ఏ స్వార్ధం చింత లేకుండా ఎవరైతే సర్వ మానవాళి, సర్వ ప్రాణి కోటి శుభాన్ని కోరతారో వారి శుభాన్ని పరమాత్మ కోరతాడు. కనుక మనమందరమూ మానవ జాతి ఈ పెను ముప్పు నుంచి రక్షించ బడాలనీ, అందరూ సుఖంగా ఉండాలని కోరుకుందాము. అందరి సుఖంలోనే మన సుఖం ఉన్నదన్న సత్యాన్ని గుర్తిద్దాము.

6. ఒక్క మనిషి సుఖంగా బ్రతకాలంటే ఎంత మంది మానవుల సహాయ సహకారాలు ఉంటే అది సాధ్యపడుతుందో గుర్తించి, అందరి శుభం కోరుకుందాము, మనం సుఖంగా ఉందాము.

తొమ్మిది ననిముషాల సేపు ఎందుకంటే, తొమ్మిది పూర్ణ సంఖ్య కనుక మనకు పూర్ణత్వము సిద్థిస్తుంది, జగన్మాత అవుగ్రహం లభిస్తుంది కనుక !

"ధర్మ ఏవ హతో హన్తి
ధర్మో రక్షతి రక్షితః"

జై హింద్ జై భరతమాత
మానవ జాతి వర్ధిల్లు గాక!
పరమాత్మనే నమోనమః

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
డా.విశాలాక్షి.

Dasakumar Charitra దశకుమార చరిత్ర.

 దశకుమార చరిత్ర.
         - - - - - - - - - - - - - - -
డా.హరి శివకుమార్ గారి సిద్ధాంత గ్రంథము "కేతన - ఆయన కృతులు."

శ్రీ మాలఘటిక కేతన గారు దండిమహాకవి సంస్కృతమున రచించిన దశకుమార చరిత్రను అనువదించినారు. దానిని శ్రీ కొట్టరువు తిక్కనగారికి అంకిత మిచ్చినారు.

ఆయన  ప్రప్రథమముగ "ఆంధ్ర భాషా భూషణము" అను పేరున తెలుగు భాషలో వ్యాకరణమును రచించి, ఆంధ్రభాషా వ్యాకరణ రచయితలకు మార్గదర్శకులయ్యారు.

శ్రీ కేతన గారు ధర్మశాస్త్రములందలి ప్రీతితో యాజ్ఞవల్క్య స్మృతిని అనువదించి, విజ్ఞానేశ్వరుని వ్యాఖ్య మీద గల గౌరవముతో తన గ్రంథమునకు ఆ పేరే పెట్టుకున్నారు.

శ్రీ కేతన గ్రంథములను అధ్యయనాంశముగా స్వీకరించి తమ సిద్ధాంత గ్రంథమును పైన పేర్కొన్న మూడు ముఖ్య భాగములుగా విభజించి మనకు అందించారు డా శివకుమార్ గారు. ప్రస్తుత చర్చనీయాంశము ఆ పరిశోధనా గ్రంథములోని ప్రథమ అధ్యాయము. అది "దశ కుమార చరిత్రము. "

శ్రీ కేతనార్యులవారు తమ అనువాదములో మూల రచయిత శ్రీ దండిమహాకవికి ఎంతో న్యాయము చేసినారని డా.హరి శివకుమార్ గారు తెలియజేసినారు. అనువాదకుని యొక్క స్వతంత్రమైన బుద్ధి వైభవము ఆయన రచనలో ద్యోతకమగుచున్నదని భావించినారు.

డా.శివకుమార్ గారు తమ పరిశోధన గ్రంథములోని ప్రథమ భాగమైన "దశ కుమార చరిత్రము" ను -

1. కథాకావ్య ప్రక్రియా వివేచనము,
2.దండి - దశ కుమార చరిత్ర,
3. దశకుమార చరిత్రము - అనువాద పద్థతి,
4.దశకుమార చరిత్రము - పాత్ర చిత్రణము,
5.దశ కుమార చరిత్రము - రస భావములు,
6.దశ కుమార చరిత్రము - వర్ణనములు,
7.కేతన కవితా శక్తి,
8.కేతన రచనా పాటవము
9.ఆంధ్ర కథా కావ్యములు - దశ కుమార చరిత్రము -

అను తొమ్మిది అధ్యాయములుగా విభజించినారు.

మార్గ కవిత్వము, దేశి కవిత్వములలో మార్గ కవిత్వమునకు పెద్ద పీట వేసిన శ్రీ తిక్కన సోమయాజులు, వారి అనుచరులు కేతన, మారన, బయ్యన మొదలగు వారు 12 వ శతాబ్దమునకు చెందినవారు.

"అభినవ దండి", "కవిజన మిత్రుడు" అను బిరుదములు పొందిన శ్రీ కేతన గారు రచించిన, సంస్కృత గద్య కావ్యములలో, కథా కావ్యములలో మిక్కిలి ప్రసిధ్ధమైన దశకుమార చరిత్ర  గ్రంథమును అంకితము పొందిన తిక్కనామాత్యులు కేతనను "సంస్కృతాది భాషల నుతి గన్నవాడని" ప్రశంసించారు.

కథా కావ్యములనగానే మనకు స్ఫురించునవి శ్రీ బాణభట్టు కాదంబరి, దండి దశకుమార చరిత్ర, హాలుని గాథా సప్తశతి మున్నగునవి. కథా కావ్యములందలి కథలన్నియు కల్పితములు, లౌకికములు. "కథ్యతే ఇతి కథా". భామహుడు కథ, ఆఖ్యాయిక అని రెండు రకాలను పేర్కొని, ఆఖ్యాయికలో నాయకుడు చెప్తాడనీ, కథలో కవి గానీ, ఇతరులు గానీ కథకులని చెప్పారు. దండి దశకుమార చరిత్రలో ఈ రెండు లక్షణాలు కనిపిస్తాయి.  దశకుమార చరిత్ర  పూర్వపీఠిక, ఉత్తర పీఠిక అని రెండు భాగములుగా నున్నది.

దండి మహాకవి గొప్ప కల్పనా శక్తి కలవాడు, గొప్ప పండితుడు, శాస్త్రజ్ఞుడు, లోకజ్ఞుడు. అనేక విద్యలయందు ప్రావీణ్యత సంపాదించాడు. శిల్పకళయందు చతురుడు. ఈతని అసలు పేరు ఎవరికీ తెలియదు. ఈ మహాకవి వ్రాసిన ఒక పద్యము వలన ఈతనికి "దండి" అను నామము స్థిరపడినదని చెప్తారు.

"బ్రహ్మాండ చ్ఛత్ర దండః శతధృతి భువనాంభోరుహోనాల దండః
క్షోణీ నౌ కూప దండః శరదమృత సరిత్పట్టికా కేతు దండః!
జ్యోతిశ్చక్రాక్ష దండస్త్రిభువన విజయస్తంఘ్రి దండోంఘ్రి దండః
శ్రేయస్తే విక్రమస్తే వితరతు విబుధ ద్వేషిణాం కాల దండః"!!

దండిమహాకవి రచన పదలాలిత్యంతో అలరారుతుంది.
" ఉపమా కాళిదాసస్య
భారవేరర్ధ గౌరవమ్!
దండినః పదలాలిత్యం
మాఘే సన్తి త్రయో గుణాః"!!

కవిగా దండిమహాకవికి వ్యాసవాల్మీకులతో సమాన స్థానమిచ్చారు.

" జాతే జగతి వాల్మీకౌ
కవి ఇత్యభిధా2భవత్!
కవీతి కథ్యతే వ్యాసో
కవయస్త్వయి దండిని"!!

దశకుమార చరిత్రకు, క్షేమేంద్రుని బృహత్కథా మంజరికిని పోలికలున్నట్లుగ కనిపిస్తుంది. బృహత్కథా మంజరిలోని కొన్ని కథలే దశకుమార చరిత్రకు మూలమని కొందరి అభిప్రాయము.

చాలామంది ఛందోబద్ధమైన పద్య రచన చెయ్యటం కష్టమేమో కానీ, గద్యము వ్రాయటమేముంది?" అనుకుంటూ ఉంటారు. కానీ
"గద్యం కవీనాం నికషం వదన్తి" అన్నారు. పద్య రచనకెంతటి నైపుణ్యమవసరమో, గద్యానికీ అంతటి పాండిత్యమవసరమని చెప్పారు.

ఇతర సాహిత్య ప్రక్రియల వలెనే కథాకావ్య ప్రక్రియ కూడా సంస్కృతము నుండియే ఆంధ్రము గ్రహించబడినది.
" గద్యమ్మున దండి చెప్పిన కథాక్రమమొప్ప దెనుంగు బాస గద్యమ్మును పద్యముల బెరయ సంచిత భావ రసోదయాభిరామమ్మగునట్లుగా" కేతన దశకుమార చరిత్రను ఆంధ్రీకరించి, ఆంధ్రులకు గద్య కథా వాఙ్మయామృతమును రుచి చూపించినారు. తదాదిగా మనకు తెలుగులో అనేక కథా కావ్యములుద్భవించాయి.

పటువైన మృదువైన శైలిలో, దీర్ఘ సమాస పద భూయిష్ఠముకాని పదములతో ప్రసన్నతా గుణముతో నొప్పారునట్లు రచించబడిన దశకుమార  చరిత్ర పదిమంది యువకుల, రాజ కుమారుడు, మంత్రి కుమారుడు మొదలగు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కుమారుల సాహస గాథలను, దిగ్విజయములను వర్ణించు కథల సంపుటి. ఇందులో రాజవాహనుని కథ ముఖ్యమైనది. ప్రధాన కథతో పాటుగ అనేక ఉప కథలు చెప్పబడ్డాయి. ఒక కథ యందు మరొక కథ ప్రవేశ పెట్టబడుతూ
అనేక ప్రయోజనములు సాధింపబడ్డాయి. రాజవాహనునికి అవంతీ సుందరితో పరిణయము జరిగి కథ సుఖాంతమవుతుంది. 

బాల్యమునుండి కలిసి మెలిసి పెరిగిన రాజకుమారుడు  రాజవాహనుడు, అపహారవర్మ, ఉపహారవర్మ, మంత్రగుప్తుడు, అర్ధపాలుడు,  సోమదత్తుడు, మిత్రగుప్తుడు, ప్రమతి, పుష్పోద్భవుడు మరియు విశ్రుతుడు అను పదిమంది మంచి స్నేహితులు. వీరి చరిత్రే దశ కుమార చరిత్ర. ఈ పదిమంది జట్టుకు నాయకుడు రాజకుమారుడు రాజవాహనుడు.

రాజవాహనుని కథ, అపహార వర్మ కథ, పుష్పోద్భవుని , బంధుపాలుని వృత్తాంతము, అర్ధపాలుని కథ, విద్యేశ్వరుని కథ మెదలైనవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి నడిచాయి.

రాజవాహనునికి పట్టాభిషేకం జరగడానికి ముందు ఈ పది మంది స్నేహితులు ఒక చోట కలిసి, అక్కడి నుంచి ఎవరికి వారుగా వెళ్ళి ఏడాది తరువాత తిరిగి అదే చోట కలుసుకోవాలనీ, అనుభవాలను పంచుకోవాలనీ నిర్ణయించుకుని ఆ రాత్రికి అందరూ చెట్టు క్రింద విశ్రమిస్తారు. ఆ సమయంలో అక్కడికి వచ్చి అర్ధించిన మాతంగునికి సహాయం చెయ్యటానికి రాజవాహనుడు అతనితో కలిసి వెళతాడు. మర్నాడు ఉదయం స్నేహితులందరూ నిద్ర లేచి చూసి, రాజవాహనుని వెతుకుతూ తలా ఒక వైపుకు వెళ్తారు. సంవత్సర కాలం పూర్తవగానే రాజవాహనుడు అక్కడికి వస్తాడు. మిగిలిన కుమారులందరూ నెమ్మది  నెమ్మదిగా అక్కడికి చేరుతారు. ముందు రాజవాహనుడు తాను మాతంగునితో వెళ్ళినప్పటి నుంచి జరిగిన వృత్తాంతం చెప్తాడు. తరువాత అందరూ తమ తమ విచిత్రానుభవాలను పంచుకుంటారు. అదే దశ కుమారుల చరిత్ర. కర్ణికను ఆధారంగా చేసుకుని పద్మము యొక్క రేకలన్నీ ఉండునట్లుగా, కథ ఆసాంతమూ రాజవాహనుని ఆధారం చేసుకుని, కాండము నుంచి శాఖోపశాఖలుగా విస్తరించిన వృక్షంలా కథలను విస్తరింపజేసి తమ కథాకథన శిల్పంతో పట్టి నిలిపారు దండి మహాకవి, కేతన మహాకవి.

కథా కావ్యములో ఉండవలసిన అద్భుతరసము దశకుమార చరిత్రలో పుష్కలంగా ఉంది. దండి మహాకవి కల్పించిన అలౌకిక సన్నివేశములలో కొన్ని రాజవాహనుడు పాతాళ లోకమును సందర్శించటము, మానసారుడు తపస్సు చేసి, శివుని వద్ద నుండి ఒక గదను పొందటము, అవంతీ సుందరి రాజవాహనులు, తారావళీ కామపాలురు తమ పూర్వ జన్మ వృత్తాంతము తెలుసుకొనటము, రాక్షసునిచే నపహరింపబడిన కందుకవతి మరియొక రాక్షసునిచే రక్షింపబడుట మొదలైనవి.

అద్భుత కల్పనా చాతుర్యముతో, సముచిత పాత్రపోషణ, సంభాషణ, వర్ణనలతో దండిమహాకవి చేత రచింపబడిన దశకుమార చరిత్రను ఆంధ్రీకరించుటలో అంతటి ప్రతిభను ప్రదర్శించి శ్రీ కేతన కథా సాహిత్యమును ఆంధ్రులకు పరిచయము చేయుటే గాక, సాహిత్యము నాంధ్రీకరించుటలో మార్గదర్శిగా ఖ్యాతిగాంచెను.

దండి మహాకవి కథను ప్రధానము చేసి, సర్వ కావ్య గుణములను తదనుగుణముగా మలచి, వృత్తి, రీతి  పాకాదులు, శయ్యాలంకారాదులు సరిజూసి, తన కావ్య రచనా శిల్ప చాతుర్యమును వెలార్చెను.
కేతన దశకుమార చరిత్రలోని కథకు, కావ్యశిల్పమునకు ఆకృష్టుడై, అలతి అలతి మార్పులు జేయుచు కావ్యముగా మలచినాడు.

ప్రతి పాత్ర ఆ పాత్రకు తగిన రీతిలో ఔదార్యవంతముగా మలచబడినవి. రాజహంసుడు ధర్మ వర్తనుడైన రాజశ్రేష్ఠుడు. గర్వాంధుడై తనపైకి దండెత్తి వచ్చిన మానసారుని ఓడించి, క్షమించి వదిలివేసినాడు. ధర్మవర్మ మంచి రాజుకు ఉండవలసిన గుణములు కలవాడు. మత్తపాల, చండవర్మ, వికటవర్మలు దుష్ట స్వభావులు. రాజవాహన, మంత్రగుప్త, ఉపహారవర్మలు అద్వితీయ పరాక్రమవంతుడు, పరోపకార శీలురు. అపహారవర్మ కార్యసాధకుడు, నేర్పరి, ఔదార్యవంతుడు. ఆపన్నులను రక్షించఠమే ప్రవృత్తిగా కలవాడు. ఉఫహారవర్మ, మంత్రగుప్తుడు మంచి యుక్తిపరులు. అలాగే స్త్రీ పాత్రలు, అనేక ఇతర పాత్రలు చిత్రీకరింపబడ్డాయి. కథా కథనములో, రస పోషణలో, పాత్ర చిత్రణలో, కథా శిల్పములో, అనేక రీతులలో దండిమహాకవి, శ్రీ కేతన కూడా తమ ప్రతిభను ప్రదర్శించారు.

కావ్యోద్భవమునకు ప్రతిభా వ్యుత్పత్యభ్యాసములు మూడును కారణములుగా ముమ్మటుడు నిర్వచించాడు.

"శక్తిర్నిపుణతా లోక శాస్త్ర కావ్యాద్యవేక్ష్యణాత్!
కావ్యజ్ఞ శిక్షయాభ్యాస ఇతి హేతుస్తదుద్భవే" !!

జగన్నాథుడు ప్రతిభ ఒక్కటే కావ్య హేతువని నిర్ణయించారు. భగవద్దత్తమైన ప్రతిభకు వ్యుత్పత్తి,  అభ్యాసము కూడా తోడైతే, ఎంత చక్కని కావ్యకన్నియలుద్భవిస్తాయో ఎందరో కవులు నిరూపించారు. వారిలో దండి మహాకవి, శ్రీ కేతన కవి కూడా ఉన్నారు.

కేతన యొక్క భావుకతా శక్తికి పద్య రచనకు గూడ తిక్కనపై నీతడు రచించిన సీసపద్యములు నాన్యతో దర్శనీయమై వెలయుచున్నవి. ఉదాహరణకు ఒకాక పద్యం పరికిద్దాము.

"సుకవీంద్రబృంద రక్షణకు డెవ్వడనినవీ
డను నాలుకకు దొడవైనవాడు
చిత్త నిత్యస్థిత సివుడెవ్వడనిన వీ
డను శబ్దమును కర్ధమైనవాడు
దశదిశావిశ్రాంతయశు డెవ్వడనిన వీ
డని చెప్పుటకు బాత్రమైనవాడు
సకల విద్యా కళాచణుడెవ్వడనిన వీ
డని చూపుకు గురియైన వాడు
మనుమసిద్ధి మహేశ సమస్త రాజ్య
భార ధౌరేయు డభిరూప భావభవుడు
కొట్టరువు కొమ్మనామాత్యు కూరామి సుతుడు
దీన జనతా నిధానంబు తిక్కశౌరి - - - ".

కావ్యమునకు ఆత్మ రసము. రసమునకు ఔచిత్యము ప్రాణము వంటిది. రసపోషణలో దండి మహాకవి ఎంత సమర్ధుడో, కేతన కవి కూడా అంతటి సమర్ధతను చూపించినాడు.

అలంకారములు కావ్య కన్నియ అందాన్ని ఇనుమడింపజేస్తాయి.  ఉపమj ఉత్ప్రేక్ష స్వభావోక్తి అర్ధాంతరన్యాసాది అలంకారములతో తమ దశకుమార చరిత్రను మరింత అందంగా తీర్చి దిద్దారు, ఆంధ్ర సాహితీ జగత్తులో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకుని చిరయశస్సు నార్జించుకున్నారు.
ఇంతటి మహత్తర గ్రంథ పరిశోధన చేసి డా.హరి శివకుమార్ గారు చిర యశస్సు నార్జించుకున్నారు.

స్వస్తి.
🙏🙏🙏💐
డా.విశాలాక్షి

Ugadi..Continued

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కాలపరబ్రహ్మణే నమో నమః.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది పండుగ మనందరికీ సకల శుభములను కలిగించు గాక ! మానవాళిని భయభ్రాంతులను చేస్తున్న కరోనా వైరస్ సంపూర్ణముగా నశించిపో గాక !

రాబోయే సంవత్సర నామము శ్రీ శార్వరి. రాబోయే ఉగాది నుంచి శ్రీ శార్వరి నామ సంవత్సరం ప్రారంభమవుతున్నది. ఎల్లుండి 25.3.2020 నుంచి ప్రారంభమవబోతున్న శ్రీ శార్వరి నామ సంవత్సరంలో శర్వరీ దేవి - శర్వుడు, శర్వాణి సర్వ మానవాళికి, సర్వ ప్రాణికోటికి ఆయురారోగ్యైశ్వర్యములను అనుగ్రహించు గాక !

శార్వరి అంటే శర్వుని భార్య శర్వాణి. శర్వ శర్వాణులకు సంబంధించినది శార్వరి. కనుక ఈ సంవత్సరమంతా శివపార్వతుల కటాక్షంతో శుభాలు జరుగుతాయని మనం గ్రహించాలి. .

శర్వుడు అనగా భూమి నుంచి పంటలను పండించే శక్తి కలవాడు.
శర్వాణి అనగా శర్వుని భార్య, పార్వతీదేవి. భూమి నుంచి మనకు కావలసిన సస్యములను మనకు అనుగ్రహించి ఇస్తుంది.

శర్వుడనగా ప్రళయ కాలమున భూములను హింసించేవాడు అని విద్యార్ధి కల్పతరువులో చెప్పారు. అనగా ప్రళయ కాలంలో ప్రకృతిని బాధించే వారిని హింసించే వాడని అర్ధము.

శర్వరి అనగా వ్యాపారమును - అనగా పనులను గాని, దినమును కానీ చెరచునది, అనగా రాత్రి అని అర్ధము.

"రాతి సుఖం దదాతీతి రాత్రి" అన్నారు. ఇనందాన్నిచ్చేది రాత్రి. భౌతిక, లౌకిక విషయాసక్తిని తగ్గించి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగించేది, ఆనందాన్నిచ్చేది శార్వరి.

"యా నిశా సర్వ భూతేషు తస్య జాగర్తి సంయమీ" అన్నారు.
సాధారణ మానవులకు ఏది పగలో, అది జ్ఞానులకు, యోగులకు రాత్రి. వారి రాత్రి వీరికి పగలు. అనగా, సాధారణ మానవులు అజ్ఞానంతో దేహాత్మ బుద్ధితో భౌతిక సుఖాలే శాశ్వత మనుకుంటారు. యోగులు, జ్ఞానులు నిత్యానిత్య వివేకం కలిగి, భౌతికత యొక్క అశాశ్వతత్వాన్ని, పరమాత్మ యొక్క శాశ్వతత్వాన్ని గ్రహిస్తారు. అలా గుర్తింపజేసేది శార్వరి.

"శార్వరి వత్సరే
సస్య వృద్ధిః భవేత్ భువి !
రాజానో విలయం యాంతి పరస్పర జయేచ్ఛయా" !! అని చెప్పారు.
అంటే, ఈ శార్వరి సంవత్సరంలో పంటలు సమృద్ధిగా చక్కగా పండుతాయి. కానీ, రాజులు - అంటే అధికారులు ఎవరికి వారే గెలవాలనే తపనతో విలయ తాండవం చేస్తారు. విలయం అఖంటే విశేషంగా లయించటం. ధర్మానికి ఎప్పుడూ విజయమే లభిస్తుంది.

యుగాదినే మనము ఉగాది అంటున్నాము.
ఉగస్య ఆదిః ఉగాది - ఉగము అంటే నక్షత్ర గమనము అని అర్ధము. నక్షత్ర గమనానికి ప్రారంభపు రోజు. ఈ రోజు నుంచి నూతన కాలగణన ప్రారంభమవుతుంది కాబట్టి ఈ రోజుకు ఉగాది అని పేరు వచ్చింది.

ఉగము అనే పదానికి జన్మ, ఆయుష్షు అనే అర్ధాలు కూడా ఉన్నాయి. దీనిని బట్టి, ఈ సృష్టి యొక్క, ప్రపంచము యొక్క ఆవిర్భావానికి మొదటి రోజు ఈ రోజే  కనుక, అనగా చైత్ర శుద్ధ పాడ్యమిన కనుక ఈ రోజును మనం ఉగాదిగా పండుగ జరుపుకుంటాము.
బ్రహ్మ దేవుడు ప్రప్రథమంగా సృష్టి ప్రారంభించింది చైత్ర శుద్ధ పాడ్యమిన కనుక మనము ఆ రోజును ఉగాది పండుగగా జరుపుకుంటాము.

కాలయులో జరిగే మార్పులను మనము చక్కగా గ్రహించగలుగుతాము. చైత్ర మాసంలో ప్రకృతి ఎంతో ప్రసన్నంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. సూర్యుని వేడిమి ఎక్కువే సూచనలు కనిపిస్తున్నా  ఎక్కువ వేడి ఉండదు, వానలు ఉండవు. ప్రకృతిలో సమతౌల్యత భాసిస్తుంది. పగలు, రాత్రి కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. చెట్లు చిగురుస్తాయి. సువాసనలు వెదజల్లుతూ, మల్లెలు, సన్నజాజులు విరబూయటం ప్రారంభిస్తాయి. చక్కని పూతతో నిండిన మామిడి చెట్ల మీద కూర్చుని కోకిలలు కుహూ రాగాలాలపించటం మొదలెడతాయి. వేప చెట్లు నిలువెల్లా పూలతో నిండి, సువాసన భరితమైన, ఆరోగ్యకరమైన గాలులో పరిసరాలను శుద్థి చేస్తూ, కన్నుల పండుగగా గోచరిస్తుంటాయి.

యుగము అంటే జంట. ఉత్తరాయణ దక్షిణాయనములనబడే రెండు భాగములుగా  కల సంవత్సర కాలమునకు ప్రారంభ దినము కనుక ఈ రోజును ఉగాది అంటారు.

ఉగాది నాడు మనమందరమూ తప్పకుండా చేయవలసిన పనులు - సూర్యోదయానికి ముందే నిద్ర లేచి అభ్యంగన స్నానమాచరించటము, ఉగాది పురుషుని ఆరాధించి, వేప పచ్చడి నివేదించి, మనము స్వీకరించటము, పంచాంగశ్రవణము చెయ్యటము, ప్రపాదాన ఫ్రారంభము చెయ్యటము.

పంచాంగ శ్రావణము పాపహరము. తిథి వార నక్షత్ర కరణ యోగము లనబడే పంచాంగ జ్ఞానము కలిగి ఉండి, ప్రకృతి మాతకు అనుకూలంగా జీవితమును గడుపుతూ ఐహికంగా ఆయురారోగ్యైశ్వర్యములను, ఆముష్మిక శుభములను, నిశ్శ్రేయస్సును పొందుదుము గాక!!

🙏🙏🙏💐
డా.విశాలాక్షి

యుగాది - ఉగాది ప్రాశస్త్యం. Importance of Ugadi

యుగాది - ఉగాది ప్రాశస్త్యం.
--------------------------------------

సృష్ట్యారంభ దినారంభం యుగారంభం - ఉగాది పండగ - యుగాది పండగ.
ఆంధ్రుల,  కన్నడ, మరాఠి జనులకు
మహోత్సాహదము మొదటి పండగ
చైత్రశుధ్ధ పాడ్యమి దినమే
ప్రకృతి లో ప్రజలకు ప్రథమ దినం.
కాలగణన ప్రారంభ దినం.
కొత్త వత్సరం, కొత్త మాసం, కొత్త దినం
ఈరోజేనని భాస్కరాచార్యులు ప్రకటించారు.

జ్యోతిశ్శాస్త్రం ఖగోళ శాస్త్రం,  పుట్టిన దేశం, పండినదేశం మన భారతదేశం.!!
సూర్యుని ద్వాదశ రాశుల చలనము
చాంద్రమాన, బార్హస్పత్య, నక్షత్ర మాన, సౌర, సావన కాలమానములకు కారణము.

ఉ - అన - ఉడు - నక్షత్రం
గ - అన - గమనం
ఆది - అన - ప్రథమం
చంద్రుడు నక్షత్రాలలొ కదిలే
క్రమారంభమే ఉగాది అనబడు.

పన్నెండు పౌర్ణముల, అమావాస్యలతొ
కొలవబడు కాలమే చాంద్రమానం.
అది మనకు సంవత్సరం.
ఆంధ్రులకు ప్రామాణికం చాంద్రమానం.

బార్హస్పత్యం బృహస్పతి మానం.
గురువు ఒక రాశిచక్ర భ్రమణకాలం
మన ద్వాదశ చాంద్రమాన సంవత్సర కాల సదృశం.
అట్టి ఐదు వత్సరములను
ఒక యుగమనుట కద్దు.
పన్నెండు ఐదుల అరువది కనుక
మనకు కలవు సంవత్సరములు అరవై.
అవియే మళ్ళీ మళ్ళీ పరిభ్రమిస్తాయి.
ఆ యుగ ఆరంభం చైత్రశుధ్ధ పాడ్యమి నాడే!
అందుకే ఉగాది ని యుగాది అంటారు.

ఉగాది నాడే బ్రహ్మదేవుడు
సృష్టిని ప్రారంభించాడు.
ప్రకృతి అంతా ఆకులు రాల్చి
క్రొత్త చిగుళ్లను తొడిగేను.
నవ కిసలయ శోభతొ, పూలుపళ్ళతొ
ఎంతోకళకళలాడేను.
నవ జీవనాన్ని అవి పొందేను.
మన అభివృద్ధిని సూచించేను.
పరవశముతొ కోకిల గానం చేసేను.
సువాసన సంభరితమౌ
మల్లెలు మొల్లలు విరగబూసి
సౌరభమంతా నిండేను.
వసంత కాలమె మధుమాసం.
ప్రకృతిలో మైమరపించే అందం,
ఆనందం నిండును వసంతమందే.

ఉగాదినాడు మనకందరకూ
దశవిధ కృత్యాచరణమె శ్రేష్ఠం
ప్రతి గృహ ధ్వజారోహణమే ప్రథమము.
తదుపరి తైలాభ్యంగన, ఛత్రచామర,
పాదుకా స్వీకరణ, దమనేన బ్రహ్మపూజన,
సర్వాపత్శాంతికర  మహాశాంత్యాచరణ,
నింబ పుష్ప భక్షణము,
పంచాంగశ్రవణము,
ప్రపాదాన ప్రారంభము,
రాజ, స్నేహ దర్శనము, దశమము వాసంత నవరాత్రారంభ పూజనము.

ఆవుపేడతో కళ్ళాపి జల్లి,
చక్కని రంగవల్లులు తీర్చి,
గుమ్మాలకు చూతపత్ర తోరణమమర్చి,
సకల దేవతలనారాధించి, నింబపుష్ప భక్షణ చేయవలె.
వేపపువ్వు పచ్చడి తినవలె.
నింబ వృక్షమన ఉత్తమ వృక్షము
బహువిధ వైద్యగుణ భరితము నింబము.
నింబ కుసుమ కిసలయ భక్షణ
రక్షించును మన దేహమును
బహువిధ రోగాదులనుండి.
వేపచెట్టు గాలి పూర్తి ఆక్సిజనేసుమా!

తీపి, పులుపు, వగరు, చేదు, కారం, ఉప్పు
రుచుల కలయికే, ఉగాది పచ్చడి ప్రత్యేకం.
శరీరానికారోగ్యప్రదం.
రసనేంద్రియ నిగ్రహమే అవసరం. అన్ని రుచులు ఆస్వాదనీయములె.
షడ్రుచుల సమ్మేళన వలెనే,
కష్టసుఖాలను, మంచిచెడులను,
అన్నిటినీ సమపాళ్ళలోనె గ్రహియించవలె, సమానముగ భావించవలె.

త్రిగుణాలను నిగ్రహించుచు, సత్వమునే పెంపొందించవలె.
వసంత కాలపు ఆనందం
మన జీవితమంతా నిండవలె.

భూతదయే మన కర్తవ్యమని
ప్రపాదానమును చేయవలె.
చలివేంద్రము లేర్పరచవలె.
ఎండ తీవ్రతను తట్టుకొనుటకై
ఛత్ర, పాదుకల దానమీవలె.
వసంత నవరాత్ర పూజనమున
శ్రీరామచంద్రునారాధించవలె.

అన్నిటికంటె మిన్నగ తప్పక పంచాంగ పూజనము, పంచాంగ శ్రవణము చేయగావలె.
పంచాంగశ్రవణము కలిగించును
మనకెంతో హితమును.
తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములె -
పంచాంగములని పిలువబడు.
తిథిపూజ వలన సంపద,
దీర్ఘాయువు వారమునను,
నక్షత్ర పూజతొ పాపవిముక్తి,
యోగమున నారోగ్యము,
కార్యజయము కరణమున,
సమకూరునని శాస్త్ర వచనము.

భక్తి ఙ్ఞాన వైరాగ్య కుసుమ శుభ సౌరభమున,
మనసు గుబాళించవలె.
ప్రతి వత్సరమీ ఉగాది నాడు
పెద్దల ఆశీర్వచనములన్,
హితైషుల అభినందనలన్
తప్పక మనమూ పొందవలె.
శుభకార్యముల చేపట్టవలె.
సౌఖ్యముగా జీవించవలె.

వికారి వెళ్ళి, వస్తోంది శార్వరి.
వికారి వత్సరము చివరన జూపెను వికారము.
కరోనా పేరున కార్చిచ్చు రగిలించె,
ప్రాణ భయముతో మనిషిని గదిలోన బంధించి,
విశ్వ మానవ జాతి ఐక్యతను పెంచె.

అద్య అడుగిడిన శార్వరి శృణాతి శార్వరియా? హింసించునా జనుల చంపివేసి ?
శర్వుని శార్వరియై రక్షించునా మనల నాదుకొనుచు !!
చూడగావలె,
పరమేశి కృపను గోరి
ప్రార్ధనలు చేసి మన్నింప వేడుకొనగ
కరుణ కలగదా తల్లికి తనయులందు !!

🙏🙏🙏🙏🙏
 జై హింద్. జై జగన్మాత
🙏🙏🙏🙏🙏

రచన::
డా.విశాలాక్షి.