భర్తృహరి నీతి శతకము పరిచయము.
-------------------------------------
సంస్కృత, ఆంధ్ర వాఙ్మయములలో గద్యము, పద్యము, నాటకము, చంపూ మొదలైన అనేక సాహితీ ప్రక్రియలున్నాయి. వాటిలో శతక సాహిత్యము కూడా అత్యంత విస్తారమైనది.
శతకము అనగా వంద పద్యాలతో రచింపబడిన ఒక సాహితీ ప్రక్రియ. శతకములో ప్రతి పద్యానికీ చివరలో ఒక పదము గానీ, కొన్ని పదములుగానీ, లేక పూర్తి చరణము గానీ ఒకేలా ఉండటం ఆనవాయితీ. దీనిని మకుటము అంటారు. ఆంధ్ర శతకములో ఈ పద్ధతి అధికంగా గోచరిస్తుంది. ఉదాహరణకు 'విశ్వదాభిరామ వినురవేమ' అనునది వేమన శతకము నకు మకుటము. అలాగే 'సుమతీ' అనునది సుమతీ శతకమునకు మకుటము. అదే విధముగా కృష్ణా అనునది కృష్ణ శతకమునకు మకుటము. అలాగే 'శ్రీకాళహస్తీశ్వరా' , 'దాశరథీ కరుణా పయోనిధీ,' 'వేంకటేశ్వరా' ! 'గువ్వలచెన్నా' 'కుమారీ' 'కుమారా' మొదలైనవి ఆయా శతకములకు మకుటములు. కొన్ని శతకములు మకుటము లేకపోయినా, వంద శ్లోకములు లేక పద్యములు రచింపబడటము వలన, ఇతర శతక లక్షణములను కలిగి ఉండటము వలన శతకములని వ్యవహరింపబడతాయి.
ఒక కావ్యము కానీ ఇతర సాహిత్య గ్రంథమును దేనినైనా తీసుకుంటే, వాటిలో మొదటి నుంచి చివరి దాకా ఒక కథ ఉంటుంది. లేక ఒక అంశానికి సంబంధించి ప్రతి పద్యానికీ అనుబంధం ఉంటూ చెప్పబడుతుంది. కానీ శతకములలోని పద్యములు అలా కాదు. కవి ఒక అంశాన్ని ఎంచుకుని శతకములోని అన్ని పద్యములలోను ఆ అంశమును బోధించునట్లు రచించినా ప్రతి పద్యము దేనికదే పరిపూర్ణమైన ఒక భావాన్ని గురించి చెప్తుంది. ఏ పద్యానికాపద్యం విడిగా ఉంటుంది. చక్కని నీతిని బోధించటమో, సంఘములోని అంశాలను తెలియజెయ్యటం, ఒక దైవము గురించి ప్రస్తావించటమో ఉంటుంది. అందుకే శతకాలు సామాన్య ప్రజానీకంలో ఎంతో ఆదరణను పొందాయి. తెలుగులో సుమతీ శతకము, వేమన శతకము, శ్రీకాళహస్తీశ్వర శతకము, శ్రీకృష్ణ శతకము మొదలైన ఎన్నో శతకాలు జనాదరణ పొందాయి. సంస్కృత శతకములలో భర్తృహరి రచించిన నీతి శతకము విశేష జనాదరణ పొందిన గ్రంథము.
శతకానికుండ వలసిన లక్షణాలను ముఖ్యంగా ఐదింటిని పేర్కొన వచ్చును. అవి. 1. సంఖ్యా నియమము, 2. మకుట నియమము, 3. వృత్త నియమము, 4. రస నియమము, 5. భాషా నియమము.
శతకములో ఒక రసము ప్రధానమైనచో, ఇంక ఆ శతకములోని పద్యాలన్నీ అదే రసమును పోషిస్తాయి. ఇతర రసముల ప్రయోగ ముండారాదని నియమము. అలా ఆయా రస ప్రధానమైన శతకములెన్నో ఉన్నాయి. రస నియమముల ననుసరించి వెలువడిన శతకములలో ముఖ్యమైనవాటిలో కొన్ని - భక్తి శతము, శృంగార శతకము, నీతి శతకము, వైరాగ్య శతకము, వేదాంత శతకము, హాస్య శతకము, కథా శతకము, సమస్యా శతకము, మొదలగునవి.
సంస్కృత భాషా ప్రాచీన కవులలో విఖ్యాతి గాంచిన భర్తృహరి సంస్కృత శతక కర్తలలో పేరెన్నికగన్నవారు. ఆయన శతక త్రిశతి కర్త. శృంగార శతకము, నీతి శతకము, వైరాగ్య శతకము అను శతక త్రయమును రచించారు. ఈ మూడింటిని కలిపి ఒక లఘుకావ్యముగా చెప్తారు. ఆయన ఇతర రచనలు చేసినారు.
ఈ కవి తన గ్రంథములలో ఎక్కడా తన జీవిత కాలమును గూర్చి తెలియ జేయలేదు.
ఆయన జీవితములోని కొన్ని సంఘటనలు మాత్రము కథల రూపమున అనుశ్రుతముగా తెలియవచ్చుచున్నవి.
భర్తృహరి ఉజ్జయినీ రాజ వంశస్థుడనియు, రాజు కావలసినవాడు, తన భార్య దుశ్శీలముచే సంసారమును రోసి, రాజ్యమును తన తమ్ముడగు విక్రమార్కున కప్పగించి తాను వానప్రస్థుడయ్యెనని ఒక ప్రతీతి ఉన్నది. ఈ విక్రమార్కుడే విక్రమ శకాబ్దమునకు మూల పురుషుడు. వరరుచి, విక్రమార్కుడు, భట్టి, భర్తృహరులు సోదరులని చెప్పుదురు.
భర్తృహరి జీవితమును గురించి కాలమును గురించి అనేక కథలు ప్రచారములో నున్నాయి. ఇదియే సత్యమని ఎవ్వరూ రూఢి పరచలేదు. భర్తృహరి ఒక మహారాజు అని, ఇహపర సౌఖ్యములను విడిచి విరాగియై సన్యాసమును స్వీకరించినాడని, గొప్ప విద్వాంసుడనీ, కవి అనీ, యోగి అనీ మటుకు తెలియుచున్నది. ఆయన రచనలు లోకోపకారకములయి, చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి,ఆయనకు అఖండ కీర్తి నార్జించి పెట్టాయి.
బహుళ ప్రచారము పొందిన భర్తృహరి శతకములను మహాబలుడు, ఆవంచ రామచంద్ర బుధేంద్రుడు, ధనసారుడు, రామర్షి, గుణవినయుడు, మీననాథుడు, ఇంద్రజిత్తుడు మొదలగు వారు వ్యాఖ్యానించినారు. వారిలో రామచంద్ర బుధేంద్రుడు రచించిన వ్యాఖ్య ఆంధ్ర దేశముననే గాక, యావద్భారతమున వ్యాప్తిలో ఉన్నది. ఆయన పీఠికలో -
“ విప్రేణా భూతపూర్వం ఫలమధి తపసాలంభి సూర్యప్రసాదా
ల్లబ్ధ్వా తస్మాత్ స్వయం తత్ప్ర చురతరజరా పఞ్చతా కుఞ్చనాఢ్యమ్ !
హిత్వా మోహం స్వకాన్తా స్వతి విమల ధియా తం నిషే వ్యాప్తభవ్యో
యోగీన్ద్రో భర్తృహర్యాహ్వయ ఇహ కురుతే ౽ ద్యాపి విద్యా విలాసమ్.”
అను శ్లోకమున ఈ విషయము ప్రస్తావించ బడింది.
"ఒకానొక బ్రాహ్మణుడు తనకు సూర్యప్రసాదముచే లభించిన ఫలమును తన ప్రభువగు భర్తృహరికి ఇచ్చారు. ఆ ఫలమును భుజించినవారు జరా, రోగములు లేక యౌవనవంతులుగా ఉంటారు. ఆ ఫలమును భర్తృహరి తనకత్యంత ప్రియమైన తన భార్యకు ఇచ్చారు. ఆమె దానిని తాను భుజించక, తన జారునకు ఇచ్చింది. అతడు దానిని తన మరో ప్రియురాలికి అర్పించెననియు, ఆమె దేశాన్ని పరిపాలించే ప్రభువనే భక్తి భావముతో ఆ ఫలమును భర్తృహరికి సమర్పించెననియు, ఆ విధముగా తనకు అనుగ్రహించ బడిన ఫలము తన వద్దకే వచ్చి చేరింది. ఈ సంగతి తెలిసినంతనే రాజు లోక వృత్తముపై అసహ్యించుకొని, విరాగియై అడవులకు జేరెను."
భర్తృహరి తన వైరాగ్య శతక ప్రారంభమున ఈ విషయమును ప్రస్తావించారు.
"యాం చింతయామి సతతం మయి సా విరక్తా
సాప్యన్యమిచ్ఛతి జనం స జనోన్యసక్తః !
తస్మిన్ కృతే చ పరితుష్యతి కాచిదన్యా
ధిక్తాం చ తం చ మదనం చ ఇమాం చ మాం చ"!!
ఎవరిని నేను నిత్యము స్మరిస్తానో, ఆమె నాయందు విరక్తితో ఉన్నది. ఆమె వేరొకరిని ఇష్టపడుతుంది. అతనికి మరొక స్త్రీ అంటే ఇష్టం. ఆమెకు అతనియందనురక్తి లేదు. ఆమె మరొకరిని అభిమానిస్తుంది. ఛీ! ఆమెను, అతనిని, మదనుని, ఈమెను, నన్ను నేను గర్హించుచున్నాను."
భర్తృహరి తన శృంగార శతకములో తరుణ వయస్కుల మనస్సులలో ఎటువంటి భావములు కలిగి నుద్రేకింపజేయునో, అవి యే విధంగా మనస్సును కలచివైచి శాంతిని దూరము చేయునో అటువంటి కామాదికములను గురించి ప్రస్తావించారు.
భర్తృహరి వైరాగ్య శతకము వేదాంత సిద్ధాంతమును ప్రతిఫలింపజేయుచుండును. తృష్ణాచ్ఛేదన మావశ్యకమనియు, ఐహిక బంధమునకు మూలము లోభము కనుక కామక్రోధాది అరిషడ్వర్గాలను జయించాలని బోధించారు. ప్రపంచములోని సర్వము తాత్కాలికములేనని గ్రహించి, నిత్యానిత్య వివేకముతో వైరాగ్యము పొంది సుఖించాలని బోధించారు.
"భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం,
మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం !
శాస్త్రే వాద భయం, గుణే ఖల భయం, కాయే కృతాంతాద్భయం,
సర్వం వస్తు భయన్వితం భువి నృణాం వైరాగ్య మేవా భయమ్"!!
భర్తృహరి తన నీతి శతకములో సర్వ మానవాళికీ అనేక విధములుగా నీతిని బోధించారు. మానవులందరికీ ఉపకరించే విద్య, ధనము, ధైర్యము, ఆత్మ గౌరవము మొదలైన అనేక అంశాలను వివరించారు. ఆయన నీతి శతకమును పది పద్ధతుల క్రింద విభజించారు. ప్రతి పద్ధతిలోను పది శ్లోకాలు చొప్పున ఉన్నాయి. అవి -
1. మూర్ఖ పద్ధతి
2. విద్వత్ పద్ధతి
3. మానశౌర్య పద్ధతి
4. అర్ధ పద్ధతి
5. దుర్జన పద్ధతి
6. సుజన పద్ధతి
7. పరోపకార పద్ధతి
8. ధైర్య పద్ధతి
9. దైవ పద్ధతి
10. కర్మ పద్ధతి.
భర్తృహరి సుభాషిత త్రిశతిని తెలుగులోనికి అనేకులు అనువదించారు. ఆ కవులలో ఎలకూచి బాలసరస్వతి, ఏనుగు లక్ష్మణ కవి, పుష్పగిరి తిమ్మన అను ముగ్గురు ముఖ్యులు. వీరిలో ఏనుగు లక్ష్మణ కవి అనువాదము విస్తృత ప్రచారములో నున్నది. ఈయన ఆరువేల నియోగి బ్రాహ్మణుడు. ఈయన వంశములోని పూర్వీకులైన జలపాల మంత్రి గారు తూర్పు గోదావరి జిల్లా సంస్థానాధీశ్వరుల వద్ద ఏనుగులను బహుమతిగా పొందటం చేత వీరి పూర్వీకుల ఇంటిపేరు స్థానములో ఏనుగు చేర్చబడి వ్యవహరింప బడుతున్నది. ఏనుగు లక్ష్మణ కవి రామేశ్వర మాహాత్మ్యము, విశ్వామిత్ర చరిత్రము, శ్రీ సూర్య శతకము మున్నగు రచనలను కూడా చేశారు.
భర్తృహరి రచించిన, ఏనుగు లక్ష్మణ కవి చేత అనువదింపబడిన నీతి శతకమును అధ్యయనము చేద్దాము.
🙏🌹
డా.విశాలాక్షి.
No comments:
Post a Comment